సీబీఐ అంటూ రూ. 41 లక్షల లూటీ
బనశంకరి: విదేశాలకు డ్రగ్స్ సరఫరా కేసులో చిక్కుకున్నారని బెదిరించి మహిళా సాప్ట్‌వేర్ ఇంజినీరు నుంచి భారీ మొత్తంలో దోచుకున్నారు. ముంబై ఎయిర్ కస్టమ్స్ అధికారుల పేరుతో రూ.40.18 లక్షలు వసూలు చేశారని బాధితురాలు (30) బెంగళూరు పశ్చిమ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. ఈ నెల 7వ తేదీన గుర్తుతెలియని నంబరు నుంచి యువతికి ఫోన్ చేసిన వంచకుడు.. కొరియర్ కంపెనీ ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. మీ పేరుతో ముంబై నుంచి ఇరాన్‌కు పంపించిన పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని, మీ మొబైల్ నంబరు కూడా ఉందని, ఇది మీకు తెలుసా అని అడిగాడు, యువతి తనకు తెలియదని చెప్పగా, ముంబై ఎయిర్ కస్టమ్స్ కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ చేస్తానని అని మరో వ్యక్తికి కనెక్ట్ చేశాడు. ఎయిర్ కస్టమ్స్ అధికారినంటూ మాట్లాడిన మోసగాడు.. ఆమె చేత టెలిగ్రాం యాప్‌ని డౌన్‌లోడ్ చేయించి వీడియోకాల్ చేశాడు. నేరగాళ్లు మీ వివరాలను సేకరించి కొరియర్‌కు ఉపయోగించారు, మేము మూడు విధాలుగా దర్యాప్తు చేసి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తామని నమ్మించారు. ఆమె, కుటుంబ సభ్యుల సమాచారం తీసుకున్నారు. మీ అకౌంట్‌లో ఉన్న డబ్బును తమ అకౌంట్ కు జమచేయాలని, ఆర్‌బీఐ విచారణ తరువాత మళ్లీ మీ అకౌంట్ కు జమచేస్తామని చెప్పారు. వారి మాటలు నమ్మిన యువతి తన మూడు బ్యాంకు అకౌంట్ల నుంచి మొత్తం రూ.40.18 లక్షల నగదును వంచకుల అకౌంట్లకు జమ చేసింది. ఆ తరువాత మోసగాళ్ల ఫోన్లు స్విచాఫ్ కావడం, తన డబ్బు తిరిగి రాకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వ్యాపారికి రూ. 80 లక్షల సైబర్ టోపీ
దొడ్డబళ్లాపురం: సైబర్ నేరగాళ్ల వలలో పడ్డ వ్యాపారి అక్షరాలా రూ.80 లక్షలు పోగొట్టుకున్న సంఘటన రామనగర పట్టణంలో చోటుచేసుకుంది. రామనగర పట్టణ నివాసి ఖుర్రం బాషా బాధితుడు. బాధితుని మొబైల్ నంబరును మోసగాళ్లు తమ వాట్సాప్ గ్రూప్‌లోకి చేర్చారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే దండిగా లాభాలు వస్తాయని అందులో ప్రచారం చేసేవారు. ఇది నమ్మిన బాధితుడు వంచకులు సూచించిన యాప్‌లో అకౌంట్ తెరిచాడు. షేర్ల కొనుగోలుకంటూ రూ.80,34,563 బదిలీ చేశాడు. చివరకు ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలేదు. మోసపోయానని తెలుసుకున్న వ్యాపారి రామనగర సీఈఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మహిళకు రూ. 9 లక్షలు
మైసూరు: షేరు మార్కెట్‌లో పెట్టుబడి అని మహిళకు నమ్మించి రూ.9.27 లక్షలు వసూలు చేశారు. మైసూరు నగరంలోని ఆనంద్ నగరకు చెందిన సుమా బాధితురాలు. ఆమె వాట్సాప్‌కు వచ్చిన మెసెజ్‌ను చూసిన మహిళ లింక్ నొక్కింది. ఓ వ్యక్తి కాల్ చేసి తాము షేర్ మార్కెట్‌లో స్టాక్ స్ట్రాటజీ ఎక్స్చేంజ్ పేరుతో షేర్లలో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలను ఇస్తామని నమ్మించాడు. ఆమె సరేనని ఆన్‌లైన్‌లో రూ. 9.27 లక్షలు చెల్లించింది. చివరకు మోసపోయినట్లు తెలుసుకుని సైబర్ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.
మహిళా టెక్కీని బెదిరించి
రూ. 40 లక్షలు వసూలు
బెంగళూరులో ఘటన
ఇద్దరు యూపీ సైబర్ నేరగాళ్ల అరెస్టు
సిలికాన్ సిటీతో పాటు రాష్ట్రంలో జనం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. డబ్బున్నవారినే ఎంచుకుని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. మీ పేరుతో డ్రగ్స్ రవాణా అవుతున్నాయని డిజిటల్ అరెస్టు చేసి ఓ మహిళా టెక్కీ నుంచి రూ. 40 లక్షలకు పైగా కాజేశారు. బెంగళూరులోనే ఈ నేరం చోటుచేసుకుంది. ఇటువంటి కాల్స్‌ను నమ్మరాదని, కాల్‌ను తక్షణం కట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రధాని మోదీనే ఇటీవల చెప్పారు.
శివమొగ్గ: శివమొగ్గ నగరవాసికి సీబీఐ అధికారులమని వీడియో కాల్ చేసి రూ. 41 లక్షలను కొట్టేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ అహ్మద్ (45), అభిషేక్ కుమార్ శేట్ (27) అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ మిథున్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. సెప్టెంబరు 27వ తేదీన శివమొగ్గ నగరంలోని గోపాలలో నివసించే ఆనంద్ (72) అనే వ్యక్తికి వీరు వీడియో కాల్ చేశారు. నీ ఆధార్ కార్డు ద్వారా పెద్దఎత్తున అక్రమ నగదు బదిలీ జరిగింది, దానిపై ఫిర్యాదు వచ్చాయి, నీ అరెస్టుకు వారెంటు జారీ అయ్యిందని చెప్పారు. నీ బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశామని, ఈ కేసు నుంచి నీవు బయటపడలేవని బెదిరించారు. నిన్ను కాపాడాలి అంటే మేము చెప్పినట్లు నగదు పంపాలని సూచించారు. దీంతో భయపడిపోయిన బాధితుడు రూ. 41 లక్షలను వారు చెప్పిన ఖాతాలకు పంపించాడు. తరువాత ఇదంతా మోసమని తెలిసి శివమొగ్గ సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీలు అనిల్ కుమార్, భూమారెడ్డి, కారియప్పలు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు ఖాతాల ప్రకారం యూపీలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేసి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment