రఘునందన తీర్థులకు పూజలు
రాయచూరు రూరల్: మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో మఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్ ఆధ్వర్యంలో రఘునందన తీర్థుల ఉత్సవాలు జరిగాయి. శనివారం రాత్రి శ్రీపాదంగల్ భక్తుల సమక్షంలో మూల రామునికి అభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు.
కారు– లారీ ఢీ.. వైద్యుడు మృతి
సాక్షి,బళ్లారి: కారు– లారీ ఢీకొన్న ఘటనలో ఓ వైద్యుడు మృతి చెందారు. ఆదివారం దావణగెరె జిల్లా ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యుడు తిమ్మేగౌడ(34) అనే వ్యక్తి కారు నడుపుకుంటూ వెళుతుండగా దావణగెరె సమీపంలో ముందు వెళుతున్న లారీకి కారు ఢీకొనడంతో వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చిత్రదుర్గ తాలూకా సిరిగేరి సముదాయ ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యుడు దావణగెరెలో చిన్నారుల శ్వాసకోశ సంబంధిత జాతీయ సమావేశంలో పాల్గొని ఈప్రమాదంలో మృతి చెందారు. దావణగెరె గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నింబళగేరిలో ఏటీఎం ప్రారంభం
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు తాలూకా నింబళగేరి గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను ఉజ్జయిని జగద్గురువులు సిద్దలింగ రాజదేశికేంద్ర శివాచార్య భగవత్పాద శివాచార్య మహాస్వామీజీ చేతుల మీదగా ప్రారంభించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ ఇప్పటి నుంచి గ్రామంలో ఏటీఎం సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేనేజర్ రాజన్న, గ్రామ నాయకులు హెచ్‌కే. కల్లేష్, రాజేంద్రగౌడ, ఉమేష్, సందీప్‌గౌడ, జి.విజయప్ప, మహంతేష్, శిలాచారి, పీడీఓలు పాల్గొన్నారు.
మహంతశ్రీ అవార్డుల ప్రదానం
రాయచూరు రూరల్: నగరంలో మహంతశ్రీ అవార్డుల ప్రదానం, ప్రతిభా సుగమ సంగీతోత్సవ సంబరాలు నిర్వహించారు. ఆదివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జరిగిన కార్యక్రమాలను మాజీ మంత్రి లీలాదేవి ఆర్.ప్రసాద్, చిక్కసూగూరు మఠాధిపతి సిద్దలింగ మహాస్వామీజీలు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమాజానికి, విద్యా, పాత్రికేయ రంగానికి చేసిన సేవలను గుర్తించి విజయ మహంతశ్రీ అవార్డును మాజీ మంత్రి లీలాదేవి ఆర్ ప్రసాద్‌కు, మహంతశ్రీని శరణయ్యకు, గురురక్షను శశికళకు, పాత్రికేయుల్లో అరవింద్ కులకర్ణికు ప్రదానం చేశారు. సమావేశంలో నగరసభ సభ్యుడు జయన్న, ప్రతిభా సుగమ సంగీత సంస్థ అధ్యక్షుడు శరణప్ప గోనాళు, ప్రతిభ, కేశవరెడ్డి రామనగౌడ, పాగుంటప్ప, వినోద్‌లున్నారు.
జాతరకు అన్ని ఏర్పాట్లు
రాయచూరు రూరల్: తాలూకాలోని దేవసూగూరులో వెలసిన సూగూరేఽశ్వరుని జాతర, రథోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ అధికారులకు సూచించారు. ఆదివారం దేవసూగూరు ఆలయంలో జాతర పోస్టర్లలను ఆయన విడుదల చేసి మాట్లాడారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, వైద్యం, ఆరోగ్యం, ఆర్టీసీ బస్సుల సంచారం, ఇతరత్ర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ గజానన, తహసీల్దార్ సురేష్ వర్మ, శరణబసవ, ఈఓ చంద్రశేఖర్‌లున్నారు.
అనాథ యువతికి పెళ్లి
హుబ్లీ: సేవా భారతీ ట్రస్ట్ బాలల కళ్యాణ కేంద్రంలో గత 12 ఏళ్ల నుంచి ఆశ్రయం పొందుతున్న 22 ఏళ్ల అన్నపూర్ణేశ్వరి అనే కన్యకు శనివారం కంకణ భాగ్యం ప్రాప్తించింది. దీంతో ఆ కేంద్రంలోని సభ్యులంతా ప్రముఖులతో కలిసి తమ ఇంటిలో పుట్టిన ఆడపడుచులా పెళ్లి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. 10 ఏళ్ల వయస్సులోనే అనాథ బిడ్డగా అన్నపూర్ణేశ్వరి ఈ కేంద్రంలో చేరింది. గదగ్ జిల్లా హొళెఆలూరుకు చెందిన 27 ఏళ్ల యువకుడు వినోద్‌కుమార్‌తో కేశ్వాపురలోని సేవా సదన కళ్యాణ మంటపంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. సంఘ్ పరివార్ ప్రముఖులు చెన్నవీరప్ప, చెన్నమ్మ దంపతులు కన్యదాన పీఠంపై కూర్చొని పెళ్లి కార్యాన్ని జరిపించారు. సదరు కేంద్రంలోని 35 మంది బాలికలు కొత్త బట్టలు కట్టుకొని సొంత అక్క పెళ్లి వేడుకల్లో పాల్గొన్ననట్లుగా ఈ పెళ్లిని నెరవేర్చారు. సదరు ట్రస్ట్ పదాధికారులు, సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు జాతీయ సేవా సదన్ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు వచ్చి కన్యాదానం చేశారు. ప్రముఖులు జగదీశ్ శెట్టర్, శిల్ప శెట్టర్లతో పాటు స్థానికులు వేడుకలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment