‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్‌ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్‌ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు

Published Tue, May 7 2024 4:25 AM

‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్‌ ఖమ్మం అభ్యర్థి నామ నాగే

● కన్న తల్లి ఎంతిష్టమో.. ఖమ్మం అన్నా అంతే ● హైవేల నిర్మాణం, రైల్వే సమస్యల పరిష్కారం నా మార్క్‌ ● సమస్యలపై పార్లమెంట్‌లో పోరాడేదే నేను.. ● ఖమ్మం బిడ్డగా, ప్రజాసేవకుడిగా నన్ను ఆశీర్వదిస్తారు.. ● కేసీఆర్‌ హయాంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి

నా కృషితోనే జాతీయ రహదారులు

నేను ఎంపీ కాకముందు ఖమ్మం లోక్‌సభ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంది. ఒక్క కిలోమీటర్‌ రోడ్డు కూడా జాతీయ రహదారి లేదు. ఇవ్వాళ ఖమ్మం జిల్లాలో వచ్చిన ప్రతీ జాతీయ రహదారి నా మార్క్‌. అప్పట్లో సెంట్రల్‌లో కాంగ్రెస్‌ ఉన్నా నేను వెంట పడ్డా.. దీనికి సాక్ష్యం పార్లమెంట్‌లో నేను వేసిన ప్రశ్నలు, నేను రాసిన లెటర్లే. జిల్లాలో నేషనల్‌ హైవేలన్నీ తీసుకొచ్చింది నేనే. జిల్లా అభివృద్ధికి రైల్వే లైన్లు, జాతీయ రహదారులే కీలకమని గుర్తించి రూ.8వేల కోట్ల విలువైన జాతీయ రహదారులు తీసుకొచ్చా. అందులో సూర్యాపేట – ఖమ్మం హైవే పూర్తికాగా.. ఖమ్మం – దేవరపల్లి, నాగ్‌పూర్‌ రోడ్డు నిర్మాణంలో ఉంది. భద్రాచలం వైపు రోడ్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. 2009లో ఎంపీ కాగానే సొంత డీపీఆర్‌ తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేశా.

ప్రజా స్పందనకు భయపడే..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మకై ్క 48 గంటల పాటు ఆపారు. మాపై ఆ రెండు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వాళ్లే చోటా భాయ్‌, బడేభాయ్‌ అంటూ సంబోధించుకుంటున్నారు. కొందరు ఆరోపించినట్లు మేము, బీజేపీ ఒక్కటైతే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత జైలులో ఉండేది కాదు. మమ్మల్ని ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు.

నన్ను బిడ్డగా ఆదరించారు..

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నన్ను వారి బిడ్డగా ఆదరించారు. పార్టీలకతీతంగా ఓట్లు వేశారు. నేను రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ప్రజలకు సేవ చేస్తున్నా. 1996 నుంచి ప్రజాసేవ ప్రారంభించా. మా నాన్న పేరుతో ట్రస్ట్‌ పెట్టి.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశా. గత పదేళ్లలో సమస్యలపై పార్లమెంట్‌లో నేను చేసింత పోరాటం మరెవరూ చేయలేదు. దానికి సాక్ష్యం పార్లమెంట్‌లో రికార్డులు ఉన్నాయి. నేను మాట్లాడిన మాటలు చూడండి, నేను సమస్యలపై పోరాడింది చూడండి, ఎన్ని ప్రశ్నలు అడిగానో తెలుస్తుంది.

ఖమ్మం అంటే పనిచేస్తా..

నాకు కన్నతల్లి అంటే ఎంత ఇష్టమో.. ఖమ్మం జిల్లా అంటే అంత ఇష్టం. ఖమ్మం జిల్లా నుంచి ఢిల్లీ దాక ఎవరైనా వస్తే.. ఏ పార్టీ, ఏ కులం, మతం అని అడగకుండా ఖమ్మం అంటే చాలు చేతనైన పనులు చేసిపెట్టా. అనేక మంది పార్టీలు మారుతున్నారు. నాయకులు ఓట్లు వేయించుకుని పార్టీ మారితే వ్యక్తిగతంగా వారికే నష్టం. పదవుల కోసం పార్టీ మారడం కరెక్ట్‌ కాదు. అది ఏ పార్టీ అయినా. నన్ను ఇబ్బంది పెట్టాలని మా వారిని కొంటున్నారని సోషల్‌ మీడియాలో వస్తోంది. అయితే, అమ్ముడుపోయే వారిని ప్రజలు నమ్మరు. నాయకుల మాదిరి వారు మారరు కూడా. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నేతలు, శ్రేణులు కలిసికట్టుగా పనిచేస్తుండగా.. ప్రచారానికి మంచి స్పందన వస్తోంది. ఇదే నా విజయానికి గీటురాయి.

Advertisement
 
Advertisement