సీసీఐ కొర్రీలు.. రైతుల కష్టాలు
తేమ సాకుతో పత్తి కొనుగోళ్లు అంతంతే..
● తాజా నిబంధనలతో కొనుగోళ్లకు మిల్లర్ల విముఖత ● వాహనాలతో జిన్నింగ్ మిల్లుల వద్ద రైతుల పడిగాపులు ● ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోనూ అదే పరిస్థితి ● చివరకు మంత్రి తుమ్మల జోక్యంతో దిగొచ్చిన సీసీఐ
నిరసిస్తూ కొనుగోళ్లు నిలిపివేత
సీసీఐ నిర్ణయంతో ఒక మిల్లు నిండే వరకు మిగతా మిల్లర్లు ఖాళీగా ఉండాల్సి వస్తోందంటూ సోమవారం పత్తి కొనుగోలుకు ఎంపిక చేసిన జిన్నింగ్ మిల్లుల్లో సేకరణ నిలిపేశారు. సమీపంలోని సీసీఐ కేంద్రానికి కాకుండా కొనుగోలు చేసే చోటకు వెళ్లాల్సి రావడంతో రైతులు కూడా ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ఈ కారణంగా ఖమ్మంలోని సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు జరగకపోగా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 32వేల పత్తి బస్తాలు వచ్చినా గంటన్నర పాటు వేలం మొదలుపెట్టలేదు. ఆ తర్వాత కొనుగోళ్లు ప్రారంభమై సాయంత్రం వరకు కాంటాలు కొనసాగించారు.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పెడుతున్న కొర్రీలు అన్నీఇన్ని కావు. తేమ శాతం పేరుతో నామమాత్రంగానే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తుండడంతో రైతులు జిన్నింగ్ మిల్లుల వద్ద వాహనాలతో పడిగాపులు కాయాల్సి వస్తోంది. మరోవైపు కొనుగోలు చేసిన పత్తి బేళ్లు కట్టడంలో పెట్టిన నిబంధనలు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలను అసహనానికి గురి చేశాయి. సీసీఐ నిబంధనలను నిరసిస్తూ మిల్లర్ల అసోసియేషన్ ఇచ్చిన పిలుపుతో సోమవారం సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు నిలిపేశారు. జిల్లాలో సీసీఐ కేంద్రాలు ఏర్పాటైన జిన్నింగ్ మిల్లుల్లో మధ్యాహ్నం వరకు కొనుగోళ్ల జరగకపోగా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోనూ జెండా పాట రెండు గంటలు ఆలస్యమైంది.
టెండర్ల ఆధారంగా నిబంధనలు
జిన్నింగ్ మిల్లులు సేకరించిన పత్తిని బేళ్లుగా కట్టేందుకు సీసీఐ టెండర్ విధానం అవలంభిస్తోంది. ఒక్కో బేల్ తయారీకి హమాలీ, ప్రెసింగ్, కిరాయి ధరలు కలిపి మిల్లుల యజమానులు రూ.1,590 నుంచి రూ.1,600 వరకు టెండర్ వేశారు. సీసీఐ మాత్రం రూ.1,350గా నిర్ణయించి మిల్లులు దాఖలు చేసిన ధరల ఆధారంగా ఎల్–1(లోయస్ట్–1), ఎల్–2, ఎల్–3 కేటగిరీలుగా విభజించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. బేళ్లు కట్టేందుకు తక్కువకు టెండర్ వేసిన జిన్నింగ్ మిల్లుల్లోని సీసీఐ కేంద్రంలోనే తొలుత కొనుగోళ్లు చేయాలనే నిబంధన విధించింది. జిల్లాలో తొమ్మిది మిల్లుల్లో కేంద్రాలు ఏర్పాటైతే తక్కువకు కోట్ చేసిన ఒక్క మిల్లులోనే పత్తి కొనుగోళ్లు చేపట్టి, అది నిండాక మరో మిల్లులో కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుంది.
మంత్రి తుమ్మల ఆదేశాలతో..
సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనడం లేదని తెలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచే హైదరాబాద్‌లోని సీసీఐ ప్రతినిధులతో మాట్లాడారు. మార్కెటింగ్ శాఖ అధికారులకు సైతం ఫోన్‌లో సూచనలు చేశారు. మార్కెటింగ్ శాఖ, సీసీఐ అధికారులు జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరపగా అందరికీ అవకాశం ఇవ్వాలని వారు కోరారు. దీంతో దిగొచ్చిన సీసీఐ అన్ని మిల్లుల్లో కొనుగోలుకు ఆదేశాలు ఇవ్వడంతో మధ్యాహ్నం తర్వాత క్రయవిక్రయాలు మొదలయ్యాయి.
తేమ తకరారు..
మద్దతు ధర కోసం సీసీఐ కేంద్రాలకు రైతులు పత్తి తీసుకొస్తున్నా ఫలితం ఉండడం లేదు. 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉంటేనే సీసీఐ మద్దతు ధరతో కొనుగోలు చేస్తోంది. దీంతో నిర్దేశిత తేమ శాతం వచ్చేలా రైతులు వాహనాల్లోనే పత్తిని ఆరబెడుతూ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ కారణంగా కొనుగోళ్లుగా నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఈనెల 8వ తేదీ వరకు 915.65 మెట్రిక్ టన్నుల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు.
పాయింట్ ఎక్కువైనా వెనక్కే...
సీసీఐ కేంద్రానికి పత్తి తీసుకొస్తే తేమ ఎక్కువ ఉందని వెనక్కి పంపిస్తున్నారు. మా దగ్గర తేమ చూసే యంత్రాలు లేవు. అంతా బాగుందని మిల్లుకు తీసుకెళ్తే ఒక పాయింట్ అదనంగా వచ్చినా వెనక్కి పంపిస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించాలి.
– నాగండ్ల వెంకటేశ్వర్లు, ఎదుళ్లచెరువు
కొనుగోళ్లు ఆలస్యమయ్యాయి...
48 బస్తాల పత్తిని మార్కెట్‌కు తీసుకొస్తే క్వింటా రూ.6,400 ధర నిర్ణయించారు. కానీ ఉదయం వస్తే మధ్యాహ్నం 3గంటల తర్వాతే కాంటా వేశారు. జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు చేయకపోవడంతో ఇక్కడ కూడా వ్యాపారులు ముందుకు రాలేదని తెలిసింది.
– కొండా అశోక్‌చక్రవర్తి, ముష్టికుంట్ల
Comments
Please login to add a commentAdd a comment