18వరకు ఎస్సెస్సీ పరీక్ష ఫీజు గడువు
ఖమ్మం సహకారనగర్: పదో తరగతి విద్యార్థులు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఈనెల 18వ తేదీలోగా ఫీజు చెల్లించాలని డీఈఓ సోమశేఖరశర్మ ఒక ప్రకటనలో సూచించారు. ఈనెల 18వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించొచ్చని, రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ.200అపరాధ రుసుముతో డిసెంబర్ 12వరకు, రూ.500అపరాధ రుసుముతో డిసెంబర్ 21వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశముందని తెలిపారు. ఒక్కో సబ్జెక్టు ఫీజు రూ.125 కాగా, గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మూడు సబ్జెక్టుల వరకు రూ.110, ఆపై సబ్జెక్టులకు రూ.125 చొప్పున చెల్లించాలని వెల్లడించారు.
ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యాన గత నెలలో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. జిల్లా నుంచి పదో తరగతి పరీక్షలకు 342మంది హాజరుకాగా 182మంది(53.22శాతం), ఇంటర్ పరీక్షల్లో 380మందికి 216మంది(56.84శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను www. telangana openschool.org వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని డీఈఓ ఈ.సోమశేఖరశర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. కాగా, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు కోసం ఈనెల 14నుంచి 20వ తేదీ వరకు వెబ్‌సైట్ లేదా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంటర్ ఒక సబ్జెక్టు రీ కౌంటింగ్‌కు రూ.400, పదో తరగతికై తే రూ.350, ఇంటర్, పదో తరగతి అభ్యర్థులు ఒక్కో సబ్జెక్ట్ రీ వెరిఫికేషన్, జవాబుపత్రం జిరాక్స్ కోసం రూ.1,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
19న జిల్లాకు
బీసీ కమిషన్
ఖమ్మంమయూరిసెంటర్: స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్లపై ప్రజల నుండి వినతులు స్వీకరించేందుకు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు ఈనెల 19న ఖమ్మం రానున్నారని బీసీడబ్ల్యూఓ జి.జ్యోతి తెలిపారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌లో ప్రజా భిప్రాయ సేకరణ ఉంటుందని ఆమె వెల్లడించారు. ఆసక్తి కలిగిన పార్టీలు, సంఘాల ప్రతిని ధులు, ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.20 నాన్ జ్యూడిషియల్ స్టాంపు పేపర్‌పై నిర్దేశిత నమూనాలో రాసి ఈనెల 19న ఉదయం 10నుండి సాయంత్రం 4గంటల వరకు ఇవ్వొచ్చని ఆమె తెలిపారు.
‘నవోదయ’ దరఖాస్తు గడువు పొడిగింపు
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో 2025విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే పరీక్ష దరఖాస్తు గడువు మరోమారు పొడిగించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 19వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సూచించారు.
బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి
ఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం: తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా విద్యార్థులు శ్రద్ధగా చదువుతూ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని విద్యాశాఖ వరంగల్ ఆర్‌జేడీ ఓ.సత్యనారాయణరెడ్డి సూచించారు. ఖమ్మం రూరల్ మండలం ఎం.వీ.పాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తిరుమలాయపాలెంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ను సోమవారం తనిఖీ చేసిన ఆయన 9, 10వ తరగతి విద్యార్థులకు భవిష్యత్‌పై దిశానిర్దేశం చేశారు. పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకావడమే కాక ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ఎప్పటికప్పుడు చదివితే వార్షిక పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించొచ్చని తెలిపారు. ఆతర్వాత గణితంలో అత్యధిక మార్కులు సాధించేలా కొన్ని మెళకువలు నేర్పించారు. ఎంఈఓ శ్రీనివాస్, హెచ్‌ఎంలు జి.శ్రీనివాసరావు, విజయకుమారి, ఉపాధ్యాయులు పెసర ప్రభాకర్‌రెడ్డి, ఏ.వీ. నాగేశ్వరరావు, హమీద్, ప్రసాద్, నరేందర్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment