ఉద్యమ నేతకు అశ్రు నివాళి
సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రసాద్ గుండెపోటుతో మృతి
● సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం, మంత్రులు, నాయకులు ● స్వగ్రామంలో రేపు అంత్యక్రియలు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ సారథి, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ (64) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. ఉదయం వాకింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. స్నేహితులు ప్రాథమిక చికిత్స అందించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ప్రసాద్ మృతదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం పార్టీ జిల్లా కార్యాలయంలో ఉంచారు. అమెరికాలో ఉంటున్న ప్రసాద్ కుమారుడు ఖమ్మం చేరుకున్న తర్వాత భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి తరలిస్తారు. శుక్రవారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రాజకీయ వర్గాల్లో దిగ్భ్రాంతి..
పోటు ప్రసాద్ అకాల మరణం జిల్లా రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణ వార్త తెలియగానే ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో సీపీఐ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు పోటు మృతదేహంపై అరుణపతాకం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమం మంచి నేతను కోల్పోయిందని అన్నారు. జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. మృతదేహాన్ని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యులు చాడ వెంకటరెడ్డి, భద్రాద్రి జిల్లా కార్యదర్శి సాబిర్‌పాషా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకులు ఎస్.వీరయ్య, పి.సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు గుర్రం అచ్చయ్య, జి.రామయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. కాగా, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు రేణుకాచౌదరి, వద్దిరాజు రవిచంద్ర, రామసహాయం రఘురాంరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ సంతాపం తెలిపారు.
నల్లగొండలో జననం.. ఖమ్మంలో ఉద్యమం..
ఉమ్మడి నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం(వెలిదండ) గ్రామంలో 1960 సెప్టెంబర్ 1న పోటు రాఘవయ్య, సక్కుబాయి దంపతులకు ప్రసాద్ జన్మించారు. ఆయన నాయనమ్మ యర్రమ్మ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆమె వారసత్వాన్ని అందుకున్న రాఘవయ్య సాయుధ పోరాటంలో వీరోచిత పాత్ర నిర్వహించారు. ప్రసాద్ కూడా విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు భావజాలాన్ని వంటపట్టించుకున్నారు. ఏఐఎస్‌ఎఫ్‌లో చురుకై న పాత్ర నిర్వహిస్తూ ఖమ్మం సిద్దారెడ్డి కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర నాయకునిగా పనిచేశారు. ఆ తర్వాత సుదీర్ఘ కాలంపాటు ట్రేడ్ యూనియన్ రంగంలో పనిచేస్తూ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ సమితి సభ్యుడిగా పనిచేశారు. 2020 ఫిబ్రవరి 18న సీపీఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికై న ప్రసాద్ 2022 ఆగస్టులో వైరాలో జరిగిన జిల్లా మహాసభలో రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన సోదరి పోటు కళావతి మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసి ప్రస్తుతం జిల్లా పార్టీ కార్యవర్గసభ్యులుగా ఉన్నారు. సోదరుడు రమేష్ ఏఐటీయూసీ నాయకునిగా పనిచేసి గుండె పోటుతో మరణించారు. మరో సోదరుడు పూర్ణచందర్‌రావు కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment