శ్రీ కోటమైసమ్మ ఆలయాన్ని సందర్శించిన డీసీ
కారేపల్లి: మండల పరిధిలోని శ్రీ కోటమైసమ్మ తల్లి దేవాలయాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ టి. శ్రీకాంత్‌రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ భూములను పరిశీలించారు. అనంతరం దేవాలయ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. ప్రతీ ఏడాది దసరా సందర్భంగా ఐదు రోజుల పాటు జరిగే జాతరకు భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయానికి రూ.25 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని, భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో వసతులు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతుండగా, డీసీ అధికారులతో చర్చించడం గమనార్హం. ఆయన వెంట ఖమ్మం డివిజన్ కమిషనర్ వీరస్వామి, అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్, పర్సా ట్రస్ట్ చైర్మన్ పర్సా పట్టాభిరామారావు, ఈఓలు వేణుగోపాలాచార్యులు, వీవీ నరసింహారావు, దేవాదాయ శాఖ జిల్లా సర్వేయర్ అనిల్‌కుమార్, ఆలయ సిబ్బంది పగడాల మోహన్‌కృష్ణ, పర్సా సాయి పాల్గొన్నారు.
బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖరరావు
రఘునాథపాలెం: బాల్య వివాహాలు అభివృద్ధికి అడ్డుగోడలని, వాటిని సమూలంగా నిర్మూలిస్తేనే బాలల భవిష్యత్ బాగుంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖర రావు అన్నారు. మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే బీసీ బాలికల పాఠశాల, కళాశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బాలలు ఉన్నత విద్యనభ్యసించి దేశానికి, సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. బాలలకు ఉచిత న్యాయసాయం కావాలంటే తమ సంస్థను సంప్రదించాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనకు ఎయిడ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి విష్ణువందన మాట్లాడుతూ జిల్లాలో బాలల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బాలలకు సంబంధించి ఏ సమస్యనైనా గుర్తిస్తే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం బాధ్యులు నరసింహారావు, ఎయిడ్ సంస్థ డైరెక్టర్ పి.ఎస్.ఎస్. హరిప్రసాద్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ అనిత, నాగమణి, ఎయిడ్ సంస్థ బాధ్యులు మాధవి, రాందాస్, రవీందర్, రవిచంద్ర, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన పంటల పరిశీలన
ముదిగొండ: మండలంలోని మాధాపురం, మేడేపల్లి, గోకినేపల్లి, కట్టకూరు గ్రామాల్లోని మామిడి, జామ, ఆయిల్‌పామ్ తోటలను జిల్లా ఉద్యాన అధికారి ఎం.వి.మధుసూదన్, మధిర ఉద్యాన అధికారి విష్టు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాస్త్రవేత్తల సూచనల మేరకు యాజమాన్య చర్యలు చేపట్టి నాణ్యమైన దిగుబడులు సాధించాల ని రైతులకు సూచించారు. మామిడి, ఆయిల్‌పామ్, జామ తోటల్లో తరచూ వచ్చే చీడపీడల నివారణకు పలు సలహాలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment