అంతటా కాంట్రాక్టు కార్మికులే..
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో ఇంతింతై వటుడింతై అన్న చందంగా కాంట్రాక్ట్ వ్యవస్థ విస్తరించింది. పర్మనెంట్ కార్మికులతో పోటీగా భూగర్భ గనులు, సర్ఫేస్ విభాగాల్లో వీరితో పని చేయిస్తున్నారు. ఇవి కాకుండా ఆర్సీ, ఐఆర్‌పీఎం, పీఎం, వెల్ఫేర్, ఫైనాన్స్, సివిల్ విభాగాల్లోనూ పని చేయిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ ఏరియాలోని మెయిన్ ఆస్పత్రి, వర్క్‌షాపు, స్టోర్స్, ఎస్‌అండ్‌పీసీతోపాటు మరికొన్ని విభాగాల్లో 1000 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ 2004లో ఇల్లెందు జేకే ఓసీ సివిల్ విభాగంలో 16 మందితో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 56 విభాగాల్లో సుమారు 32 వేల మంది పనిచేస్తున్నారు. ఇంతవరకూ బాగానే వీరి వేతనాలు, ఇతర అంశాల్లో యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై పలువురు మండిపడుతున్నారు.
కాంట్రాక్టర్లకే కాసులు..
సింగరేణి సంస్థలో కాంట్రాక్టీకరణ విధానం మొదలైనప్పటి నుంచీ కాంట్రాక్టర్లకే కాసులు కురుస్తున్నాయి. గతంలో సింగరేణి వ్యాప్తంగా సుమారు 100 మంది ఉన్న కాంట్రాక్టర్ల సంఖ్య నేడు వేల మందికి చేరింది. అంతేకాకుండా గతంలో ఒక టెండర్‌లో 20 మంది కార్మికులు పనిచేస్తే ఇప్పుడు కొత్త వ్యక్తి టెండర్ పొందితే మరో నలుగురైదుగురు పెరుగుతున్నారు. వీరి వద్ద రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు కొంతమంది తీసుకుని పనిలో పెట్టుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా అధికారులు నోరు మొదపకపోవడంలో ఆంతర్యమేంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఒక సీనియర్ కార్మికుడు నెలంతా, రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తే రూ.50 నుంచి రూ.60 వేల వేతనం వస్తోంది. అదే కాంట్రాక్టర్లు ఏ పనీ చేయకుండానే కొన్ని టెండర్లలో రూ.లక్షకు పైగా దండుకుంటున్నట్లు సమాచారం.
సమస్యల పరిష్కారానికి ఆందోళనలు
విధులకు రాని కార్మికులకు జరిమానా విధిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధానాన్ని రద్దు చేయడంతో పాటు బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు సెమీ స్కిల్డ్ వేతనాలు, సోలార్, సులభ్, నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటా తదితర హక్కుల సాధనకు కార్మికులు ఉద్యమ బాట పట్టారు. ఇప్పటికే ఏరియాల వారీగా అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. డిసెంబర్ 1 నుండి 5వ తేదీ వరకు కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 5 నుండి 10వ తేదీ వరకు జీఎం, పీఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టేందుకు కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి.
అయినా దక్కని ప్రతిఫలం
సింగరేణి యాజమాన్యం తీరుపై
విమర్శలు
ఆందోళనకు సిద్ధమవుతున్న
కార్మికులు, సంఘాలు
జరిమానా విధించడం సరికాదు
డ్యూటీకి రాని కార్మికుడికి నో వర్క్, నో పే విధానం అమలు చేయాల్సిన యాజమాన్యం పనికి రాని కాంట్రాక్ట్ కార్మికుడికి రెండు రోజుల వేతనం జరిమానా వేయటం సరికాదు. పర్మనెంట్ కార్మికులు నెలల కొద్దీ, సంవత్సరంలో 75 రోజులు పనిచేయకపోయినా.. వారిని బతిమిలాడి పని చేయిస్తున్న యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ఇలా చేయడం సరికాదు. ఈ విధానం బ్రిటీష్ కాలంలో కూడా లేదు. దీన్ని వెంటనే రద్దు చేయాలి.
– యాకూబ్‌షావలీ, ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment