సమగ్ర యాజమాన్యమే కీలకం
● మామిడిలో పూమొగ్గలను ఉత్తేజపర్చాలి ● మిగతా పంటల్లోనూ సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ ● ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి మధుసూదన్ సూచనలు
ఖమ్మంవ్యవసాయం: పంటల్లో రైతులు చేపట్టే యాజమాన్య పద్ధతులపై దిగుబడులు ఆధారపడి ఉంటాయని ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం.వీ.మధుసూదన్ తెలిపారు. జిల్లాలోని పలు మండలాల్లో ఉద్యాన పంటల సాగును ఆయన పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా పంటల యాజమాన్యం, ఆయా పంటలకు ఆశించిన తెగుళ్లు, రైతులు చేపడుతున్న సస్యరక్షణ చర్యలను తెలుసుకుంటూ అవసరమైన సూచనలు ఇస్తున్నారు. మామిడి, ఆయిల్ ఫామ్ పంటల సాగులో ప్రస్తుత తరుణాన తీసుకోవాల్సిన మెళకువలు, తెగుళ్ల నివారణకు పాటించవలసిన చర్యలపై ఆయన ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి.
మామిడి
ఖమ్మం జిల్లాలో 32,105 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. మామిడిలో పూమొగ్గలను ఉత్తేజపరిచి త్వరగా పూత తెప్పించాల్సిన సమయమిది. ఇందుకోసం ఆడపూల శాతం పెంచడానికి పొటాషియం నైట్రేట్ 10 గ్రా., బోరాస్ 2 గ్రా.ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మామిడిలో పూత రాకముందు డిసెంబరులో తేనె మంచు పురుగులు చెట్ల మొదళ్లు, కొమ్మల బెరళ్లలో దాగి ఉంటాయి. పూత సమయానికి అవి చెట్టుపైకి ఎగబాకి పూగుత్తులను ఆశించి నష్టపరుస్తాయి. ఈ విషయాన్ని గుర్తించి తొలి దశలోనే తేనెమంచు పురుగులను నివారించేందుకు ఆసిఫేట్‌ను లీటరు నీటికి 1.5 గ్రా. లేదా క్లోరిపైరిపాస్‌ను లీటర్ నీటికి 2.5 మి.లీ. చొప్పున మరియు నువాన్ మందు లీటర్ నీటికి 0.5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. పూత ప్రారంభదశలో తేనెమంచు ఆశించే అవకాశం ఉంది. పూత ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ.ను లీటర్ నీటికి లేదా థయోమిథాక్సాం 0.4 గ్రాములను లీటర్ నీటికి కలిపి, గంధకం 3 గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తేతేనెమంచు పురుగు, బూడిద తెగులును అరికట్టవచ్చు. ఈ మందుల పిచికారీని రైతులు త్వరగా పూర్తిచేయాలని, లేకపోతే చీడలు పూతను నష్టపరిస్తే పిందెలు సరిగా ఏర్పడవు.
ఆయిల్ పామ్
ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులు తగిన మెళకువలు పాటిస్తే అనేక ప్రయోజనాలను ఉంటాయి. ప్రధానంగా పంట సాగు సమయాన మొక్కలను ప్రణాళికాయుతంగా నాటాలి. త్రిభుజాకారం / చతురస్రాకార వ్యవస్థలో 9 మీటర్ల దూరంతో మొక్కలను నాటాలి. ప్రస్తుతం ఆయిల్‌పామ్ మొక్కలను మొవ్వకుళ్లు తెగులు ఆశిస్తోంది. దీని నివారణకు కార్బండజిమ్ ఒక గ్రా.ను లీటర్ నీటిలో(100–250 మి.లీ. ద్రావణం) కలిపి మువ్వులో పోయాలి. రైనోసిరాస్ బీటిల్‌ను నివారించడానికి 20 గ్రాముల నాఫ్తలిన్ బాల్‌లను చిల్లులు గల సాచెట్లలో ఉంచాలి. ఆయిల్‌పామ్ తోటల్లో అవసరానికి అనుగుణంగా 160 నుండి 250 లీటర్ల నీటిని రోజుకు ఒక చెట్టుకు అందించాలి. ఐదేళ్లు పైబడిన తోటల్లో ఎకరానికి 5 కిలోల యూరియా, 3కిలోల డీఏపీ మరియు 5కిలోల ఎంఓపీతో ఫలదీకరణం చేయాలి. లేదంటే ఎరువులు యూరియా 650 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్పేట్ 940 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 500 గ్రాములను ఒక చెట్టుకు వేయాలి. మూడేళ్ల వరకు లేత తోటల్లో ప్రత్యేక సాధనంతో ఆడ, మగ పూగుత్తలను తొలగించాలి. అయితే, ఆకులను కత్తిరించవద్దు, కట్టవద్దు.
నిమ్మ
నిమ్మ చెట్ల పాదుల చుట్టూ మల్చింగ్ చేయాలి. జిగ్‌జాగ్‌గా ఉన్న, ఎండిన కొమ్మలను తొలగించాలి. నేలమట్టం నుండి 2 అడుగుల ఎత్తు వరకు ప్రధాన మొదలుపై పక్క శాఖలు అభివృద్ధి చెందకుండా చూసుకోవాలి. పురుగుల నియంత్రణకు డైకోఫాల్ 3 మి.లీ.ను లీటర్ నీటికి లేదా వెట్టబుల్ సల్ఫర్ (80శాతం డబ్ల్యూపీ) 3 గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment