అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
● ప్రతీ గ్రామానికి సీసీ రోడ్లు, డ్రెయినేజీలు ● పేదల సంక్షేమమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం ● రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
కూసుమంచి : గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని ముత్యాలగూడెం, చేగొమ్మ, జీళ్లచెరువు గ్రామాల్లో బుధవారం ఆయన సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా జరిగిన సభల్లో మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే తమ కష్టాలు తీరుతాయని భావించిన ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, అదే రీతిన ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తోందని, ఇప్పటికే అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పేదల మద్దతు ఉన్న ఈ ప్రభుత్వానికి ఇబ్బంది లేదన్నారు. సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందని, పేదల సొంతింటి కల నెరవేరబోతోందని అన్నారు. కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ కరుణశ్రీ, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment