100 శాతం ఉత్తీర్ణత సాధించాలి
● ఆ దిశగా ఉపాధ్యాయులు పని చేయాలి ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశం
ఖమ్మం సహకారనగర్ : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు పని చేయాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. పాఠశాలల పనితీరుపై బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో పదో తరగతి పరీక్షలు కీలకమన్నారు. పిల్లల చదువును బట్టి ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించాలని, ఏ సబ్జెక్ట్‌లో వెనుకబడి ఉంటే అవసరమైన అదనపు శిక్షణ అందించాలని సూచించారు. ఫెయిలవుతారనుకునే సీ కేటగిరీ వారికి పాఠ్యాంశాలు పలుసార్లు బోధిస్తూ ఉత్తీర్ణులయ్యేలా చూడాలన్నారు. డిసెంబర్ చివరి నాటికి సిలబస్ పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ సబ్జెక్ట్ టీచర్లు సెలవు పెడితే మండల పరిధిలోని ఇతర పాఠశాలల వారిని డిప్యూటేషన్‌పై పంపించాలని సూచించారు. అభ్యాస దీపికలతో పాటు విద్యార్థులకు మరింత సమాచారం అందించేందుకు ఖమ్మం నాలెడ్జ్ బుక్ లెట్ తయారు చేస్తున్నామని, మండలాలలో ఒక్కో సబ్జెక్ట్ నుంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఈ బుక్లెట్ రూపొందిస్తామని చెప్పారు. సమావేశంలో డీఈఓ సోమశేఖర శర్మ తదితరులు పాల్గొన్నారు.
సమాజ సేవ శాశ్వతంగా నిలిచిపోతుంది..
రఘునాధపాలెం : సమాజంలో నలుగురికి ఉపయోగపడే పనులు చేసేవారే శాశ్వతంగా నిలిచిపోతారని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. వీవీపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.3.50 లక్షలతో ఏర్పాటు చేసిన బోర్ వెల్, పైప్ లైన్, ఆర్‌ఓ ప్లాంట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. కుతుంబాక బసవనారాయణ, కోటేశ్వరరావు స్నేహానికి చిహ్నంగా కుతుంబాక మధు, కరెంట్ మోటార్‌ను కూరాకుల నాగభూషణం విరాళంగా అందించడం అభిందనీయమన్నారు. పాఠశాలలో అవసరమైన టాయిలెట్లు సైతం రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. విద్యార్థులు జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమన్నారాయణ, మాజీ ఎంపీటీసీ యరగర్ల హనుమంతరావు, మాజీ సర్పంచ్ కాపా ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment