ఖమ్మంవ్యవసాయం: నకిలీ బంగారం తాకట్టు పెట్టి కొందరు రుణాలు తీసుకున్న వ్యవహారంపై పలు బ్యాంకుల అధికారులు బుధవారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌ను కలిశారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి వన్‌గ్రామ్ గోల్డ్ ఆభరణాలకు బంగారు పూత పూసి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందిన విషయం విదితమే. జిల్లాలోని ఓ గ్రామీణ బ్యాంకుతో పాటు మరో నాలుగు వాణిజ్య బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్‌లు ఈ మోసంలో చిక్కుకున్నాయి. నకిలీ బంగారం తాకట్టు రుణాల రికవరీకి బ్యాంకర్లు ప్రయత్నిస్తుండగా, ఆయా వ్యక్తుల నుంచి సరైన సమాధానం రావడం లేదు. వారి ఫోన్‌లు కొద్ది రోజులుగా స్విచాఫ్ చేసి ఉంటుండగా, మరి కొందరు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు ఉడాయించినట్లు సమాచారం. తాకట్టు బంగారంలో జరిగిన మోసంపై పలు బ్యాంకుల అధికారులు సీరియస్‌గా తీసుకోవడంతో పాటు జిల్లా ఉన్నతాధికారులకు వివరించాలని ఆదేశించారు. దీంతో నాలుగు బ్యాంకుల అధికారులు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరెడితో కలిసి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌ను కలిసి వివరించారు. అనంతరం సీపీ సునీల్‌దత్‌ను కూడా కలిశారు. అయితే ఈ ముఠాలో ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం, చర్చి కాంపౌండ్ ఏరియా, లెనిన్ నగర్, కరుణగిరి, పోలేపల్లి, పెద్దతండా, ఏదులాపురం తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు బ్యాంకర్లు వివరించినట్లు సమాచారం. విషయాన్ని పరిశీలిస్తామని సీపీ బ్యాంకుల అధికారులకు చెప్పినట్టు తెలిసింది.
నకిలీ బంగారం వ్యవహారంపై వివరణ
Comments
Please login to add a commentAdd a comment