అమ్మో.. హాస్టళ్లు!
వంటగదులపై పట్టింపే లేదు..
సంక్షేమ వసతి గృహాలతోపాటు గురుకులాలు, కేజీబీవీల్లో కూడా వంటగదుల నిర్వహణను సిబ్బంది పట్టించుకోవడం లేదు. కనీస పరిశుభ్రత పాటించకపోవడంతో పలుచోట్ల గదుల్లో బూజు, దుమ్ము, ధూళిని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇక బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్ల వైపు వెళ్లే పరిస్థితే లేదు. వాటిని శుభ్రం చేయించడంలో వార్డెన్లు అలసత్వం వహిస్తున్నారని అధికారులు నివేదికల్లో పేర్కొన్నట్లు తెలిసింది. కొన్ని మరుగుదొడ్లకు తలుపులు కూడా లేవని గుర్తించారు. ఇక విద్యార్థులకు అందించే తాగునీరు హానికరంగా ఉన్నట్లు అధికారుల నివేదికలతో వెల్లడైంది. బోరు నీటినే విద్యార్థులకు సరఫరా చేస్తున్నారని, ఆ నీరు అపరిశుభ్రంగా ఉందని గుర్తించారు.
మాయ చేసేందుకు ప్రయత్నాలు..
కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆదేశాలతో పలు శాఖల జిల్లా అధికారులు ఈనెల 22 నుంచి 26 వరకు జిల్లాలోని కేజీబీవీ, గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో తనిఖీలు చేసి నివేదికలను అందజేశారు. ఎక్కువమంది అధికారులు అక్కడి వాస్తవ పరిస్థితులను కలెక్టర్‌కు తెలియజేసినట్లు సమాచారం. ఒకరిద్దరు అధికారులు మాత్రం తనిఖీల్లో చూసీచూడనట్లుగా వ్యవహరించారనే చర్చ బలంగా వినిపిస్తోంది. ఇక ఖమ్మం కేంద్రంలో ఓ వార్డెన్.. వసతిగృహ తనిఖీకి వచ్చిన అధికారికి తన గురించి గొప్పలు చెప్పినందుకు సదరు అధికారి పక్కన ఉండే అటెండర్‌కు నగదు ముట్టజెప్పారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు వార్డెన్లు జిల్లా అధికారులతో తమకున్న చనువుతో అంతా బాగుందనే అభిప్రాయం కల్పించేలా చూడాలని కోరినట్లు తెలిసింది. అయినప్పటికీ కలెక్టర్ ఆదేశాల ప్రకారం 90 శాతం మంది అధికారులు కచ్చితమైన నివేదికను అందించారని సమాచారం.
అందుబాటులో లేని వార్డెన్లు..
ప్రత్యేకాధికారులు వసతిగృహాల తనిఖీకి వచ్చిన సమయంలో పలువురు వార్డెన్లు అందుబాటులో లేరు. విధులు నిర్వహించాల్సిన సమయంలో వార్డెన్లు కనిపించకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. వార్డెన్లకు ఫోన్ చేసి.. తాము వసతిగృహానికి వచ్చామని చెప్పినా.. వారిని గంటల తరబడి వేచి ఉండేలా చేశారని తెలుస్తోంది. విధుల సమయలో కూడా వసతిగృహాల్లో లేకుండా బయట తిరుగుతున్నారని అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
వార్డెన్ల హడావిడి..
ఈనెల 22 నుంచి తనిఖీలు చేపట్టిన ప్రత్యేకాధికారులు ఏ రోజుకారోజు నివేదికలను కలెక్టర్‌కు అందజేశారు. దీంతో ఆయన నివేదికలను క్షుణ్ణంగా పరి శీలిస్తుండటంతో వార్డెన్లు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ప్రత్యేకాధికారులు తనిఖీ చేసినప్పుడు కూడా మరోసారి సందర్శించిన సమయంలో అన్ని పరిస్థితులు చక్కపడాలని సూచించారు. దీంతో వార్డెన్లు మరుగుదొడ్లను, పరిసరాలను, బాత్‌రూమ్‌లను శుభ్రం చేయిస్తున్నారు. స్టోర్‌రూమ్‌లు, వంటగదులు కూడా శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు. అయితే కొందరు వార్డెన్లు మాత్రం ఇప్పటికీ తమకేమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తుండడం గమనార్హం.
వసతిగృహాల్లో అధ్వానంగా
వంట గదులు, బాత్‌రూమ్‌లు
నిల్వ కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతోనే వంట
కేజీబీవీలు, గురుకులాలు,
సంక్షేమ హాస్టళ్లలోనూ ఇదే తీరు
ఉదాసీనంగా వ్యవహరిస్తున్న వార్డెన్లు
కలెక్టర్ దృష్టి సారించడంతో
ఉరుకులు.. పరుగులు
పురుగుల బియ్యం.. కుళ్లిన కూరగాయలు..
ప్రత్యేకాధికారుల తనిఖీలతో వసతిగృహాలు, కేజీబీవీలు, గురుకులాల్లో నెలకొన్న అసలు పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. వల్లభిలోని వసతిగృహం, కామేపల్లి కేజీబీవీలో బియ్యం పురుగులు పట్టి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. గురుకులాలు, వసతిగృహాల్లో కుళ్లిన కూరగాయలను గుర్తించినట్లు అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. వీటిని నిల్వ చేసే గదులు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి. వసతిగృహాల పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. అత్యధిక వసతిగృహాలు, కేజీబీవీ, గురుకులాల్లో తాజా కూరగాయలు వినియోగించడం లేదని తేలింది. నాసిరకం కూరగాయలు, బియ్యంతోనే భోజనం తయారు చేస్తున్నట్లు వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment