ఎన్నికలకు పటిష్ట భద్రత | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పటిష్ట భద్రత

Published Fri, May 10 2024 4:45 PM

ఎన్నికలకు పటిష్ట భద్రత

● ఎస్పీ సురేశ్‌కుమార్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ సురేశ్‌కుమార్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గురువారం అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, డీఎస్పీలు సదయ్య, కరుణాకర్‌తో కలిసి ఎన్నికల నిర్వహణపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగం అందించిన మహా ఆయుధం ఓటుహక్కు అని, ప్రజాస్వామ్య రక్షణకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పోలింగ్‌కు ముందు 72 గంటల పాటు పాటించాల్సిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎస్‌ఓపీ గురించి అధికారులను అడిగి తె లుసుకున్నారు. గత ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. 48 గంటల ముందు నుంచి ఆయా ప్రాంతాల్లోని వైన్‌షాపులు, లేట్‌నైట్‌ నిర్వహించే దాబాలు మూసివేయాలన్నారు. ప్రచారాలతో పాటు వాహనాలు తిరగకుండా చూడాలన్నారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల రోజు పోలీసు స్టేషన్ల పరిధిలోని మొబైల్‌ రూట్లలో ఏదైనా ఘటనలు జరిగితే స్థానిక ఎస్సై, సెక్టోరల్‌ అధికారి, రూట్‌ మొబైల్‌ టీమ్‌ అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. శాంతిభద్రతల సమస్యలు ఉంటే నోడల్‌ అధికారులకు తెలియజేయాలన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాలకు స్పెషల్‌ పార్టీ, గ్రేహౌండ్స్‌ దళాల ద్వారా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement