అర్హులందరికీ సంక్షేమ పథకాలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని బాబాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభకు డీఆర్‌డీవో దత్తారావుతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. రాళ్ల గుట్టలు, వెంచర్లు, ప్లాట్లు కాకుండా సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా అందుతుందని స్పష్టం చేశారు. అలాగే భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12వేలు అందిస్తామన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామన్నారు. అర్హుల జాబితాను గ్రామసభలో పంచాయతీ ప్రత్యేకాధికారి చదివి వినిపిస్తారని తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ప్రజలు తెలియజేయాలని సూచించారు. అభ్యంతరాలు నమోదు చేసి, మరోసారి సర్వే చేపడతామని పేర్కొన్నారు. జాబితాలో పేరు లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మండల అధ్యక్షుడు చరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment