సిరి‘కుండ’లోనే నాగోబా నైవేద్యం
ఇచ్చోడ: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగో బాకు అభిషేకం చేయాలన్నా .. నైవేద్యం సిద్ధం చేయాలన్నా సిరికొండ కుండలనే వాడుతారు. శతాబ్దాలుగా సిరికొండలోని గుగ్గిల వంశీయులు తయారు చేసిన కుండలోనే నైవేద్యం సమర్పించడం ఆనవా యితీగా వస్తోంది. నాగోబా అప్పట్లో మె స్రం వంశీయులకు కలలో వచ్చి సిరికొండలో నివసిస్తున్న గుగ్గిల వంశీయులు త యారు చేసిన కుండలనే పూజలకు ఉపయోగించాలని చెప్పినట్లు ప్రతీతి. పూజ ప్రారంభం నుంచి అఖరి రోజు నైవేద్యం సమర్పించే వరకు ఇక్కడి కుండలనే వాడుతారు.
ప్రచారయాత్రలోనే కుండల తయారీకి ఆర్డర్
కేస్లాపూర్ నాగోబా ఆలయం నుంచి ప్రారంభమైన కటోడ మెస్రం కోసేరావు, పర్దాన్ దాదారావులతో కూడిన ప్రచారం రథం(ఎడ్లబండి) మొదటిరోజే సిరికొండ మండల కేంద్రంలో ఉన్న గుగ్గిల స్వామి ఇంటికి చేరుకొని జాతరకు అవసరమయ్యే కుండల తయారీకి ఆర్డర్ ఇస్తారు. మరుసటి రోజు నుంచే కుండల తయారీ ప్రారంభిస్తారు. తయారైన కుండలకు మహాజాతర ప్రారంభానికి రెండు రోజుల ముందు మెస్రం వంశీయులు పూజలు నిర్వహించి ఎడ్లబండిపై కేస్లాపూర్‌కు తీసుకెళ్తారు.
ఏడు రకాలు.. 350 మట్టిప్రాతలు
20 పెద్ద బాణాల్లో గంగాజలం పోసి నిల్వ ఉంచుతారు. 55 నీటి కుండలు, 55 మూతలు, 45 కడుముంతలు, 150 దీపాంతలు, 25 పెంకలను ఆదివాసీలు ఆలయ పరిసర ప్రాంతాల్లో పిండివంటలు, నైవేద్యాలు తయారు చేయడానికి వాడుతారు. వీటి తయారీకి గుగ్గిల స్వామి, అతని భార్య నెలరోజుల పాటు కష్టపడుతారు. స్వామి తండ్రి రాజన్న 75 ఏళ్లపాటు కుండలు తయారు చేసి అందించారు. రాజన్న తండ్రి రాజన్న సైతం 70 ఏళ్లు కుండలను తయారు చేసి ఇచ్చారు. ప్రస్తుతం స్వామి దాదాపు 40 ఏళ్లుగా కుండలను తయారు చేసి ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment