డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన రామారావు | - | Sakshi
Sakshi News home page

డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన రామారావు

Published Sun, Oct 27 2024 10:04 PM | Last Updated on Sun, Oct 27 2024 10:04 PM

డీఈవో

డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన రామారావు

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారిగా పీవీజే రామారావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీఈవోగా పనిచేసిన తాహెరా సుల్తానా బదిలీ కావటంతో ఈ స్థానంలో నెల్లూరు జిల్లా డీఈవోగా పనిచేస్తున్న పీవీజే రామారావును కృష్ణాజిల్లా కు నియమించారు. రామారావు కలెక్టర్‌ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం డీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామారావుకు కార్యాలయ సిబ్బంది, పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

జీజీహెచ్‌లో కుష్టు వ్యాధిగ్రస్తులకు శస్త్ర చికిత్సలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో కుష్టు వ్యాధి గ్రస్తులకు ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు ఆ విభాగాధిపతి డాక్టర్‌ ఏఆర్‌సీహెచ్‌ మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లోని లెప్రసీ రోగులు శస్త్ర చికిత్స అవసరమైన వారు ఆస్పత్రిలోని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగాన్ని సందర్శించవచ్చునని తెలిపారు. సర్జరీ అవసరమైన రోగులను గుర్తించి వారిని ఆస్పత్రికి తీసుకు రావడంలో లెప్రా సొసైటీ తమవంతు సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

రేపు కృష్ణా వర్సిటీలోస్పాట్‌ అడ్మిషన్లు

కోనేరుసెంటర్‌: కృష్ణా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ, నూజివీడు ఎంఆర్‌ఏఆర్‌ కాలేజీ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్టడీస్‌లో పీజీ సీట్లతో పాటు కృష్ణా వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌, ఎంటెక్‌ కోర్స్‌లలో సీట్ల భర్తీకి ఈ నెల 28వ తేదీ సోమవారం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ఎల్‌.సుశీల శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థులు రూ.1000 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి పాల్గొనవలసి వుంటుందన్నారు. పీజీ ర్యాంక్‌ కార్డుతో పాటు సంబంధిత అన్ని ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. బీటెక్‌లో చేరే విద్యార్థులు ఏపీఈఏపీ ర్యాంక్‌ తీసుకురావాలని కోరారు. ఎంఏ ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, గణిత శాస్త్రం, బయోటెక్నాలజీ, రసాయన శాస్త్రం, బోటని, జువాలజీ, ఎం.కామ్‌, బీటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ అప్లైడ్‌ కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్‌, అప్లైడ్‌ గణిత శాస్త్రం విభాగాలలో సీట్లు భర్తీ చేస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

జీఎంసీ, జీజీహెచ్‌ను పరిశీలించిన పారా మెడికల్‌ కమిటీ

మచిలీపట్నంటౌన్‌: నగరంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులను విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కళాశాలకు చెందిన పారా మెడికల్‌ వైద్యబృందం శనివారం పరిశీలించింది. రానున్న రోజుల్లో మెడికల్‌ కళాశాలకు 50 పారా మెడికల్‌ సీట్లు రానున్న నేపథ్యంలో ఇక్కడున్న వసతులను పరిశీలించేందుకు ఈ కమిటీ పర్యటించింది. ఇంటర్మీడియెట్‌ అనంతరం ల్యాబ్‌ టెక్నీషి యన్‌, రేడియాలజిస్ట్‌ తదితర కోర్సులు చేసేందుకు ఈ ప్రాంత విద్యార్థులకు అవకాశాలు రానున్నాయి. కమిటీ సిఫార్సు మేరకు మచిలీపట్నం మెడికల్‌ కళాశాలకు ఈ సీట్లు మంజూరు కానున్నాయి. ఈ బృందంలో ప్రొఫెసర్లు ఎం.రజని, బి.వెంకట్రావు, ఎస్‌. శ్రావణి, అసోసియేట్‌ ప్రొఫెసర్లు టీవీఎస్‌ఆర్‌ మూర్తి, పీఎన్‌ నాగేశ్వరరావు, ఎ.గీత ఉన్నారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డి.ఆషాలత, ఆసుపత్రి డెప్యూటీ సూపరింటెండెంట్‌ జి.భానుమూర్తి, ఇతర వైద్యులు ఈ బృందానికి వివరాలు తెలియజేశారు.

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు నవభారత్‌నగర్‌కు చెందిన టి.శారద, శ్రీనివాస్‌ దంపతులు శనివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఆలయ ఈవో కె.ఎస్‌.రామరావు దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన రామారావు 1
1/1

డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన రామారావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement