మహిళలపై దాడులు నిత్యకృత్యం
చందర్లపాడు(నందిగామ టౌన్): కూటమి అధికా రంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై దాడులు, అకృత్యాలు నిత్యకృత్యంగా మారాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు విమర్శించారు. చందర్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. మండలంలోని విభరింతలపాడు గ్రామానికి చెందిన మానసిక స్థితి సరిగా లేని మహిళపై ఇటీవల జరిగిన లైంగికదాడి యత్నం, ఆమె చెల్లిపై దాడి కేసుల్లో నిందితుడిపై నమోదు చేసిన కేసు వివరాలను ఎస్‌ఐ దుర్గామహేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌మోహనరావు మాట్లాడుతూ.. ఇంటిలో ఎవరూ లేని సమయంలో మానసిక స్థితి సరిగాలేని మహిళపై అదే గ్రామానికి చెందిన నిందితుడు లైంగికదాడికి యత్నించాడని, దీంతో ఆమె కేకలు వేయడంతో అక్కడికి వచ్చి ప్రశ్నించిన బాధితురాలి చెల్లిపై భౌతిక దాడి చేసి గాయపరిచాడని పేర్కొన్నారు. మహిళపై జరిగిన దాడిని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలపగా వారు కేసు నమోదు చేసి బాధితురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. లైంగికదాడి చేయబోయాడని బాధితులు చెప్పినా అందుకు సంబంధించిన సెక్షన్‌లు నమోదు చేయలేదని పేర్కొన్నారు. విచారణలో తేలితే ఆ సెక్షన్‌లు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడం బాధాకర మన్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండ దండలతోనే నిందితుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని, దాడి చేయడమే కాకుండా తమ పార్టీ ఉంది, తమ నాయకులున్నారు, ఏం చేస్తారో చేసుకోండి అని ధైర్యంగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో మహిళల రక్షణకు దిశ చట్టాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. మహిళలపై జరుగుతున్న దాడులపై కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వం స్పందించి బాధితులకు రక్షణ కల్పించటంతో పాటు మానసిక స్థితి సరిగా లేని మహిళపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ముక్కపాటి నరసింహారావు, మండల కన్వీనర్ కందుల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు
Comments
Please login to add a commentAdd a comment