ఉపాధ్యాయులు ఆందోళన బాట
కర్నూలు(సెంట్రల్): కూటమి సర్కార్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. తమ హక్కులను సాధించుకోవడం కోసం ఆందోళన బాట పడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రోజుకో ధర్నా.. పూటకో నిరసన చేసి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. కలెక్టరేట్ ఎదుట రోజూ సరాసరిగా మూడు, నాలుగు ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ప్రజా ఉద్యమాలను పోలీసులతో అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏనాడు ప్రజలు రోడ్డెక్కలేదు. ఆందోళనలు చేయలేదు, రాస్తారోకో చేపట్టలేదు. వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంతో పాలన ఎంతో సాఫీగా సాగింది. ముఖ్యంగా ప్రజలకు కావాల్సిన ఇంటిస్థలం, ఇళ్ల నిర్మాణం, ఫీజురీయింబర్స్‌మెంట్, స్కీం వర్కర్లకు వేతనాల పెంపు, సమయానికి అందించడం, ఉచిత ఇసుక, మద్యం తదితర సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించడంతో ఆందోళన చేయాల్సిన పనే రాలేదు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ముందుకు వెళ్తుండడంతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. 108, 104 ఉద్యోగులు, వెలుగు వీవోఏలు, వలంటీర్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, కార్మికులు, రైతులు, ప్రజలు ఇలా.. అన్ని వర్గాల వారు తమ సమస్యలపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఆరు నెలలుగా నిత్యం ఆందోళనలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేదు.
ఉద్యమంతో ప్రభుత్వం వెనకడుగు..
ప్రజా ఆందోళనలతో యురేనియం నిక్షేపాల గుర్తింపు ప్రక్రియను నిలిపివేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ మాసంలో దేవనకొండ మండలం కప్పట్రాళ్ల పరిసర ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాల గుర్తింపు కోసం 68 బోర్ల తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో బాధిత గ్రామాల ప్రజలు కలెక్టరేట్ ముట్టడికి వచ్చారు. ఆయా గ్రామాలతోపాటు కలెక్టరేట్ వద్ద ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. వారికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం దిగివచ్చింది.
రోడ్డున పడి.. పోరుబాట
ఎన్నికల సమయంలో ఉద్యోగ భద్రతతోపాటు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వలంటీర్లకు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక వారి సేవలను వినియోగించుకోకుండా పక్కన పెట్టేయడంతో వలంటీర్లు ఆందోళనకు దిగుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత, రూ.10 వేల వేతనంతోపాటు పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ అంశంపై వారంలో నాలుగైదు రోజులు ఆందోళనలు, రాస్తరోకోలు,వినూత్న నిరసనలు ఉంటున్నాయి.
కార్మికుల కన్నెర్ర..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకు జూలై 8వ తేదీన ఉచిత ఇసుక పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం గతం కంటే ఇసుకను అధికంగా కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఒకవేళ కొనుగోలు చేద్దామని అనుకున్నా అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ పనులు పలు చోట్ల నిలిచిపోయాయి. దీంతో కార్మికులు పనులు లేక పస్తులు ఉండాల్సి వస్తోంది. దీంతో భవన నిర్మాణ కార్మికులు ఇసుక కోసం నిత్యం ఆందోళనలు చేపడుతున్నారు. వారికి మద్దతుగా ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి.
ఫీజు అందక.. చదువులు సాగక..
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐధేళ్లపాటు ఫీజురీయంబర్స్‌మెంట్ బకాయిలు అనే పదమే వినిపించలేదు. మూడు దఫాలుగా ప్రభుత్వమే జగనన్న విద్యా దీవెన, వసతి దీనెవల కింద ఫీజులు చెల్లిస్తుండడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసించారు.అయితే కూటమి సర్కార్ వచ్చాక ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై నోరు మెదపడంలేదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కట్టాలని విద్యార్థులను ఒత్తిడి చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి.
సూపర్ సిక్స్ హమీల కోసం..
ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయా లని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇవ్వాలని, మహిళలకు నెలకు రూ.1,500 ఇవ్వా లని, రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇవ్వాలని, ఉచి త బస్సు ఎక్కించాలని, ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలన్న డిమాండ్లతో ప్రతి రోజూ ఏదో ఒకరూపంలో ఆందోళనలు జరుగుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆశావర్కర్లతో చేసుకున్న హామీలను అమలు చేయాలని కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తంచేస్తున్న దృశ్యం (ఫైల్)
రోడ్డెక్కిన స్కీం వర్కర్లు
చంద్రబాబు తమను కూడా మోసం చేశారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళన బాటపట్టాయి. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ బకాయిలు, ఐర్, పదోన్నతులు, జీపీఎఫ్ పెండింగ్ అంశాలను పరిష్కరించాలని, మునిసిపల్ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపట్టాయి.
గత ప్రభుత్వ హయాంలో స్కీం వర్కర్లకు అన్ని సదుపాయాలు కల్పించి సమయానికి జీతాలు ఇస్తుండడంతో ఆందోళనలకు దిగేవారు కాదు. అయితే కూటమి ప్రభుత్వ హయాంలో స్కీం వర్కర్ల ఆందోళనలు నిత్యకృత్యమయ్యాయి. పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీలు, ఆయాలు, ఆశా వర్కర్లు, ఉపాధి హామీలో ఫీల్డ్ అసిసెంట్లు తమను అన్యాయంగా ప్రభుత్వం మారడంతో తొలగిస్తున్నారని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆందోళనలు చేపడుతున్నారు. అలాగే అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లకు గత ప్రభుత్వ హయాంలో జీతాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ మహిళలు రోడ్డెక్కుతున్నారు. ఉద్యోగ భద్రత కోసం 108,104 ఉద్యోగులు పలు ఆందోళనలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment