రేషన్ షాపులను అప్పగించాలని ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు!
కర్నూలు(సెంట్రల్): రేషన్ షాపులను తన అనుచరులకు అప్పగించాలని ఆదోని ఎమ్మెల్యే పార్ధసారథి అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆదోని పట్టణానికి చెందిన రేషన్ డీలర్లు ఇస్మాయిల్, రాజు, జావీదు, గోపాల్, బీ జావీదు, కె.జావీదు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని 62 షాపుల్లో ఎంపిక చేసిన 32 షాపులను రెండు, మూడు రోజుల్లో అప్పగించాలని డెడ్‌లైన్ విధించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 10 షాపులను బలవంతంగా తాళాలు పగులగొట్టి ఈ–పాస్ మిషన్‌లు, సరుకులను స్వాధీనం చేసుకున్నారని, మిగిలిన షాపులను స్వాధీనం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు. ఆయన ఆగడాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ వారు జేసీ డాక్టర్ బి.నవ్యకు వినతిపత్రం సమర్పించారు. 40 ఏళ్ల నుంచి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తాము రేషన్ డీలర్లుగా ఉపాధిని పొందుతున్నామని, వాటిని ఎమ్మెల్యే స్వాధీనం చేసుకుంటే రోడ్డున పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను నిర్వహించారు. జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఎస్‌డీసీలు చిరంజీవి, కొండయ్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారని జేసీ డాక్టర్ బి.నవ్య అన్నారు. ఆదోనిలో కేవలం 2, పత్తికొండలో 11, కర్నూలులో 54 సమస్యలకు పరిష్కారం చూపినట్లు తెలిపారు. కర్నూలు ఆర్‌డీఓ లాగిన్‌లో 7, పత్తికొండ ఆర్‌డీఓ 5, ఆదోని ఆర్‌డీఓ 4, పీఆర్ ఈఓ 3, కర్నూలు డీఐజీ లాగిన్లలో 3 అర్జీలు రీఓపెన్‌అయినట్లు చెప్పారు.
ఆదోని ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసుందుకే కలెక్టరేట్‌కు చేరుకున్న ఆదోని రేషన్ డీలర్లు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన ఆదోని రేషన్ డీలర్లు
Comments
Please login to add a commentAdd a comment