శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు సమకూరింది. సోమవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 25 రోజులకు గానూ రూ.3,56,04,597 వచ్చింది. అందులో నగదు రూ.3,46,84,817, నాణేలా రూపేణా రూ.9,19,780 సమకూరింది. అలాగే 64 గ్రాముల బంగారం, 1,900 గ్రాముల వెండి కానుకలు వచ్చాయి.
నేటి నుంచి సీసీఐ పత్తి కొనుగోలు నిలుపుదల
ఆదోని అర్బన్: పట్టణంలో ఆయా ఫ్యాక్టరీల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో మంగళవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు పత్తి కొనుగోలు నిలుపుదల చేసినట్లు సీసీఐ ఇన్‌చార్జ్ అధికారులు భరత్, గౌతమ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పత్తి నిల్వలు ఎక్కువగా ఉండడంతో మూడు రోజులపాటు తాత్కాలికంగా పత్తి కొనుగోలు నిలుపుదల చేస్తున్నామన్నారు.
అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి
కర్నూలు(సెంట్రల్): ప్రజా సంక్షేమం కోసం అధికారులు చిత్తశుద్ధి, నిబద్ధతతో పని చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.లక్ష్మీకాంతం అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో గుడ్ గవర్నెన్స్ వీక్–గ్రామాల వైపు పరిపాలన కార్యక్రమంలో భాగంగా వర్కుషాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సుపరిపాలన ప్రధాన లక్షణాల్లో మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధమైన పాలన అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు ఎంతో దూరం నుంచి సమస్యల పరిష్కారం కోసం వస్తారని, వారి నమ్మకాన్ని వయ్ము చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ డాక్టర్ బి.నవ్య మాట్లాడుతూ.. జిల్లాలో డిసెంబర్ 19 నుంచి 24వ తేదీ వరకు గుడ్ గవర్నెన్స్ వీక్ జరుగుతుందని, 25న వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని గుడ్ గవర్నెన్స్ వీక్ ప్రోగ్రామ్‌ను చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, స్పెషల్ డీప్యూటీ కలెక్టర్ చిరంజీవి,జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు.
31లోపు ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు చెల్లించండి
కర్నూలు సిటీ: ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియెట్ చదువుతున్న వారు ఈ నెల 31వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ తెలిపారు. సోమవారం నుంచి ఫీజులు చెల్లించే ప్రక్రియ మొదలైందన్నారు. ఒక సబ్జెక్టుకు రూ.25 అపరాధ రుసుంతో వచ్చే నెల 01 నుంచి 04వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుంతో 5 నుంచి 8వ తేది వరకు, తాత్కల్ కింద 9 నుంచి 10వ తేది వరకు ఫీజులు చెల్లించవచ్చునని పేర్కొన్నారు. టెన్త్ పరీక్షలకు రూ.5 రిజిస్ట్రేషన్ ఫీజు రూ.95 పరీక్ష ఫీజు, ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలకు రూ.5 రిజిస్ట్రేషన్, రూ.145 పరీక్ష ఫీజు, ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఒక సబ్జెక్టుకు రూ.95 ప్రకారం ఏపీ ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment