రక్తహీనత..మాతృవేదన! | - | Sakshi
Sakshi News home page

రక్తహీనత..మాతృవేదన!

Published Wed, Jan 22 2025 2:18 AM | Last Updated on Wed, Jan 22 2025 2:18 AM

రక్తహ

రక్తహీనత..మాతృవేదన!

సృష్టిలో ప్రతి ప్రాణి జీవించాలంటే శరీరంలో రక్త సరఫరా చాలా ప్రధానం. ముఖ్యంగా కౌమారదశలోకి చేరిన బాలికలు రజస్వల దాల్చిన తర్వాత వారిలో రక్తస్రావం కారణంగా రక్తహీనత క్రమంగా పెరుగుతూ పోతుంది. ఈ సమయంలో వారు సరైన పోషకా హారం తీసుకోకపోతే వివాహమైన తర్వాత తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదృష్టం బాగుంటే కొందరు కాన్పు సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పునర్జన్మ ఎత్తుతారు. లేకపోతే రక్తం తక్కువై ప్రాణాలు కోల్పోతారు. జిల్లాలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొన్నా ప్రభుత్వాలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయి.

కర్నూలు(హాస్పిటల్‌):కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రసూతి విభాగానికి ప్రతిరోజూ 25 నుంచి 30 మంది దాకా ప్రసవానికి వస్తుంటారు. వీరితో పాటు గర్భం దాల్చిన వారు రెగ్యులర్‌ చెకప్‌ కోసం మరో 250 మందికి పైగా వస్తుంటారు. వీరిలో 60 నుంచి 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. వీరిలో చికిత్స కోసం వచ్చిన వారికి అవసరమైన మందులు సూచించి, పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ప్రసవం కోసం వచ్చిన వారికి మాత్రం రక్తం తక్కువైతే అప్పటికప్పుడు బ్లడ్‌ బ్యాంకులో అవసరమైన రక్తాన్ని తెప్పించి ఎక్కించి ప్రసవం చేస్తుంటారు. తీవ్ర రక్తస్రావంతో ప్రసవానికి వచ్చిన కొందరు కోలుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. కర్నూలుతో పాటు నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు, ఆదోని మాతాశిశు ఆసుపత్రికి ప్రతి నెలా ప్రాణాపాయ స్థితిలో రక్తహీనత ఉన్న గర్భిణుల కేసులు 40 నుంచి 60 దాకా వస్తుంటాయి. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు గాను వైద్యశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, వైద్యవిదాన పరిషత్‌ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులు, అర్బన్‌హెల్త్‌ సెంటర్ల పరిధిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆశాల నుంచి వైద్యాధికారి వరకు గర్భం దాల్చిన మహిళ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. సాధారణ రక్తహీనత ఉన్న వారికి మాత్రలు, తీవ్ర రక్తహీనత ఉన్న వారికి సుక్రోజ్‌ ఇంజెక్షన్లు ఇస్తున్నామని లెక్కలు చెబుతున్నా ఇప్పటికీ చాలా మంది గర్భిణులు తీవ్ర రక్తహీనత కన్నుమూయడం ఆందోళన కలిగిస్తోంది.

70 శాతం మందికి తీవ్ర రక్తహీనత

కర్నూలు జిల్లాలో గత ఏడాది నమోదైన గర్భిణుల్లో 45.36 శాతం మందికి 11 గ్రాములలోపు, కేవలం 3.30 శాతంలోపు మందికే 7 గ్రాముల్లోపు రక్తం ఉన్నట్లు నమోదు చేశారు. కాగా నమోదైన మొత్తం 28,130 మంది గర్భిణుల్లో 93.58 శాతం మందికి ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కానీ వాస్తవ పరిస్థితులను గమనిస్తే జిల్లా వ్యాప్తంగా నమోదైన 28,130 మంది గర్భిణుల్లో 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనిక్‌ ఓపీకి వస్తున్న గర్భిణుల్లో 60 నుంచి 70 శాతం మందికి హెచ్‌బీ 10 నుంచి 6 గ్రాముల్లోపు ఉంటోందని వైద్యులు పేర్కొంటున్నారు. గ్రామాల్లోనీ పీహెచ్‌సీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, అర్బన్‌హెల్త్‌ సెంటర్లు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో ఐరన్‌మాత్రలు పంపిణీ చేస్తున్నా, మరీ రక్తం తక్కువ ఉన్న వారికి సుక్రోజ్‌ ఇంజెక్షన్లు ఎక్కిస్తున్నా, అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందజేస్తున్నా రక్తహీనత శాతం ఎందుకు తగ్గడం లేదో అధికారులే సమాధానం చెప్పాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే కోడిగుడ్లు, చిక్కీలు, కందిబ్యాళ్లు, బెల్లం తదితర పోషకాహార పదార్థాలను అధిక శాతం మంది గర్భిణులు ఇళ్లకు తీసుకెళ్లి ఇంటిళ్లి పాదికి వాడుకుంటున్నారు. ఈ కారణంగా గర్భిణిలకు సరైన పోషకాహారం అందడం లేదన్నది బహిరంగ రహస్యం. క్షేత్రస్థాయిలో ఈ విషయం గురించి అటు వైద్యాధికారులు, ఇటు ఆశాలు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది సరైన అవగాహన కల్పించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంటోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చుట్టుముట్టుతున్న ఆరోగ్య సమస్యలు

రక్తహీనత కారణంగా గర్భంలో శిశువు ఎదుగుదల సరిగ్గా ఉండక అబార్షన్‌ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి నెలలు నిండకుండానే బిడ్డ జన్మించి మరణించే అవకాశం ఉంది. గర్భిణికి టీబీ, బీపీ వచ్చే అవకాశం ఉంది. బీపీ కారణంగా ఫి ట్స్‌ రావచ్చు, బీపీతో మెదడులో నరాలు చిట్లవచ్చు. కొన్నిసార్లు తల్లి, బిడ్డ మెంటల్‌గా తయారవుతారు. అకస్మాత్తుగా గర్భంలోనే బిడ్డ చనిపోవచ్చు. కొన్నిసార్లు గర్భంలోనే మాయ విడిపోయి కాన్పు కష్టం అవుతుంది. గర్భిణికి మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రసవ సమయంలో రక్తం తక్కువై మాతృమరణాలు

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు

జిల్లాలో 70 శాతం మందికి పైగా రక్తహీనత

20 శాతం మందికి తీవ్ర రక్తహీనత

పోషకాహారం ఇస్తున్నా కనిపించని ఫలితం

క్షేత్రస్థాయిలో మరింత అవగాహన అవసరమంటున్న వైద్యులు

రక్తహీనత ఉంటే ఇలా చేయాలి

హిమోగ్లోబిన్‌ శాతం 8 నుంచి 10 గ్రాములు ఉంటే కొంచెం రక్తహీనతగా, 6 నుంచి 8 గ్రాములుంటే మధ్యస్తంగా, 6 కంటే తక్కువగా ఉంటే మాత్రం దానిని వైద్యులు తీవ్రంగా పరిగణిస్తారు. 8 నుంచి 10 శాతం ఉన్న వారికి ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు, 6 నుంచి 8 గ్రాములు ఉన్న వారు ఐరన్‌ సుక్రోజ్‌ ఇన్‌ఫ్యూజన్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. 6 కంటే తక్కువ ఉన్న వారికి మాత్రం రక్తం ఎక్కిస్తారు. గర్భిణికి మూడో నెల గర్భం నుంచి తప్పనిసరిగా ఐరన్‌ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు క్రమం తప్పకుండా వాడాలి. లేకపోతే వారు తీవ్ర రక్తహీనతకు చేరి తల్లీబిడ్డలిద్దరికీ ప్రాణాపాయం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

డాట్స్‌ విధానం మాదిరిగా పోషకాహారం ఇవ్వాలి

క్షయ వ్యాధిని నియంత్రించేందుకు ఎలాగైతే ఇంటికి వెళ్లి మందులు ఇచ్చేవారో అలాగే గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించేందుకు వారి ఇంటికే వెళ్లి పోషకాహారం తినిపించేలా చర్యలు తీసుకోవాలి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వస్తున్న గర్భిణుల్లో 60 నుంచి 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆదోని, కోసిగి ప్రాంతాలకు చెందిన మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. పోషకాహారంపై అవగాహన లేకపోవడం, జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం, సంప్రదాయ ఆహారం తీసుకోకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణం. కొంత మంది గుడ్డు తింటే మంచిది కాదన్న మూఢనమ్మకంతోనూ గర్భిణులకు వాటిని దూరం చేస్తున్నారు. రక్తహీనత వల్ల కొన్నిసార్లు మాతృమరణం జరిగే ప్రమాదం ఉంది.

–డాక్టర్‌ శ్రీలక్ష్మి, గైనకాలజి హెచ్‌ఓడీ,

జీజీహెచ్‌, కర్నూలు

No comments yet. Be the first to comment!
Add a comment
రక్తహీనత..మాతృవేదన! 1
1/2

రక్తహీనత..మాతృవేదన!

రక్తహీనత..మాతృవేదన! 2
2/2

రక్తహీనత..మాతృవేదన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement