బైక్ అదుపు తప్పి..
ఎమ్మిగనూరురూరల్: కుక్క అడ్డు రావడంతో వాహనంపై నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండల పరిధిలోని సోగనూరు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...గ్రామానికి చెందిన హరిజన ముక్కరన్న కుమారుడు సప్పొగు నారాయణ (56) పొలం పనులకు వెళ్లి ఇంటికి బైక్‌పై తిరిగి వస్తున్నాడు. గ్రామ సమీపంలోని భీమిరెడ్డి అనే వ్యక్తి పొలం దగ్గర కుక్కలు పరుగెత్తుకుంటూ బైక్‌కు వచ్చి తగిలాయి. దీంతో బైక్‌పై నుంచి అదుపు తప్పి నారాయణ కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడు వెంటనే కు టుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఇంటి పెద్ద దిక్కు చనిపోవటంతో కుటుంబ సభ్యు లు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడి భార్య బుజ్జమ్మ, కుమారుడు రవికుమార్ ఫిర్యాదు మేరకు ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
భక్తుల ఆందోళన
శ్రీశైలం: అటవీమార్గంలో ఉన్న ఇష్ట కామేశ్వరి ఆలయ దర్శనానికి ఫారెస్టు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. మంగళవారం శ్రీశైల మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు వచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల్లో కొందరు శ్రీశైల ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇష్ట కామేశ్వరి దేవిని దర్శించుకునేందుకు శిఖరం చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. అయితే, అటవీ అధికారులు 15 జీపులకు మాత్రమే అనుమతించడంతో మిగతా భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వాహనాల్లో వెళ్లేందుకు తమకు కూడా అనుమతించాలని అక్కడే బైఠాయించారు. అటవీలోకి ఎక్కువ మందికి పంపడానికి వీలుండదని అధికారులు చెప్పినా శాంతించకపోవడంతో వన్‌టౌన్ పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్ది చెప్పారు.
ఐదు జీపులు సీజ్
ఇదిలా ఉంటే ఇష్ట కామేశ్వరి ఆలయానికి వెళ్లే జీపులను వన్ టౌన్ సీఐ ప్రసాద్ రావు శిఖరేశ్వరం చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేశారు. అందులో సరైన రికార్డులు లేని ఐదు వాహనాలపై కేసులు నమోదు చేసి ఎంవీఐ ఆఫీసుకు తరలించారు.
ఆలయాభివృద్ధికి విరాళం
కొత్తపల్లి: మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొలనుభారతి దేవి ఆలయాభివృద్ధికి గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన మల్లెల భూసిరెడ్డి కుమారుడు భూసిరెడ్డి మహేశ్వర రెడ్డి లక్షరూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతను నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, ఆలయ ఈఓ రామలింగరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ వెంకటనాయుడు ప్రత్యేకంగ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment