నది నిండా గోతులు..
కర్నూలు న్యూసిటీ: తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఉచిత ఇసుక పాలసీ మాటున అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. నదిలో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ పగలు రాత్రి తేడా లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొందరు అధికార పార్టీ నేతలు ఇసుక మాఫియాగా అవతారమెత్తి ట్రాక్టర్‌కు రూ.1,500 ప్రకారం రేటు నిర్ణయించి దందా నడుపుతున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి ఇష్టానుసారంగా చాలా లోతు వరకు నదీ గర్భంలో తవ్వకాలు జరుపుతుండటంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. పూడూరు, పడిదెంపాడు, పంచలింగాల, ఈ తాండ్రపాడు, పంప్‌హౌస్, మామిదాలపాడు, మునగాలపాడు, నిడ్జూరు, జి. సింగవరం గ్రామాల సమీపంలో నది తీరం వెంబడి ఇసుక డంప్ చేసి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. సీ బెళగల్ మండలంలో సింగవరం, కొత్తకోట, ముడుమాల, ఈర్లదిన్నె, పల్లెదొడ్డి ఉన్నాయి. ఈ రీచ్‌ల నుంచి పర్యావరణానికి హాని కలగకుండా వాల్టా చట్టం ప్రకారం ఇసుకను ప్రజలకు అందించాల్సి ఉంది. మొదట ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న లబ్ధిదారులకు చలానాల ద్వారా ఇసుకను సరఫరా చేయాలి. అయితే, రీచ్‌ల వద్ద ఇసుక తెచ్చుకుని అధిక ధరకు విక్రయించాల్సి రావడంతో ఇసుక మాఫియా రూట్ మార్చింది. ఇసుక అవసరమైన వారు సమీపంలో నది, వాగు, వంకల నుంచి తవ్వి ఇసుకను తీసుకెళ్లవచ్చుననే ప్రభుత్వ నిబంధనను అడ్డుపెట్టుకుని దర్జాగా సొమ్ము చేసుకుంటోంది. తుంగభద్ర తీర ప్రాంతాన్ని ఇసుక దందాకు అడ్డాగా మార్చేసుకుంది. ప్రతి నెల ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10 వేల వరకు రెవెన్యూ, పోలీసు అధికారులకు మామూళ్లు అందుతున్నట్లు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నలో జరుగుతుందనే చర్చ సాగుతోంది.
వాల్టా చట్టం నిబంధనలకు తూట్లు పొడుస్తూ తుంగభద్ర నదిలో 20 నుంచి 30 అడుగుల మేర గోతులు తవ్వి ఇసుకను తోడేస్తున్నారు. దీంతో నదిలో కనుచూపుమేర ఎటు చూసినా భారీ గుంతలు దర్శనమిస్తున్నాయి. కర్నూలు శివారులోని కర్నూలు – హైదరాబాద్ జాతీయ రహదారి వంతెన, రైల్వే బ్రిడ్జికి అతి సమీపంలో తవ్వకాలు జరుపుతుండటతో ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయం అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. కేవలం మామూళ్ల కోసం నదీ తీరం వెంబడి గస్తీ నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నదిలో భారీగా గోతులు తవ్వి ఇసుకను తోడేస్తుండండంతో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉంది. ఆ గోతుల్లో పశువులు పడి మృత్యువాత పడతాయని సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
నగరానికి కూత వేటు దూరంలో
ఇసుక అక్రమ తవ్వకాలు
రోజుకు 300 ట్రాక్టర్లు
తరలిస్తున్న వైనం
ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1,500 వసూలు
చేస్తున్న మాఫియా
రూ.కోట్లు గడిస్తున్న
అధికార పార్టీ నేతలు
మామూళ్ల మత్తులో అధికారులు
గుంతల్లో నిలిచిన నీరు
Comments
Please login to add a commentAdd a comment