ప్రశాంతంగా ఎన్‌సీసీ ఏ – సర్టిఫికెట్ పరీక్ష
కర్నూలు కల్చరల్: ఎన్‌సీసీ ‘ఏ’ సర్టిఫికెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్, 28 ఆంధ్ర బెటాలియన్ కేడెట్లకు ఆదివారం ఏక్యాంప్ మాంటిస్సోరి పాఠశాలలో ఏ సర్టిఫికెట్‌కు సంబంధించి థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. 9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ నుంచి 422 మంది, 28 ఆంధ్ర బెటాలియన్ నుంచి 455 మంది కేడెట్లు పరీక్షలకు హాజరయ్యారు. 9 ఆంధ్ర బెటాలియన్ గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ జోబి ఫిలిప్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. కార్యక్రమంలో 28 ఆంధ్ర బెటాలియన్ ఏఓ లెఫ్టినెంట్ కల్నల్ శశికుమార్, 9 ఆంధ్ర బెటాలియన్ కార్యాలయ సూపరింటెండెంట్ రాజు, మిలిటరీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపా రు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు అందజేయాలన్నారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దేశీ కోర్సుతో వ్యవసాయ పరిజ్ఞానం
కర్నూలు(అగ్రికల్చర్): ఇన్‌పుట్ డీలర్లు వ్యవసాయ పరిజ్ఞానం పెంచుకొని.. రైతులకు చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు దేశీ డిప్లొమా కోర్సు మంచి అవకాశమని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ రత్నప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ సమావేశ మందిరంలో ఆదివారం ఇన్‌పుట్ డీలర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. డిప్లొమా కోర్సు శిక్షణ వల్ల వ్యవసాయ చట్టాలు, సాంకేతిక అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, ఇతర నిపుణులు ప్రతి వారం శిక్షణకు హాజరై సమగ్ర యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారని వివరించారు. రైతులు సలహాలు, సూచనల కోసం ఇన్‌పుట్ డీలర్లనే ఆశ్రయిస్తుంటారని, వారిని లాభసాటి వ్యవసాయం దిశగా నడిపించాలని సూచించారు. బనవాసి కేవీకే శాస్త్రవేత్త విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ... వర్షాధారం కింద ఏఏ పంటలు వేసుకోవచ్చు.. యాజమాన్య పద్ధతులను వివరించారు. స్వల్పకాలిక రకాలు, బెట్టను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. విశ్రాంత జేడీఏ జయచంద్ర మాట్లాడుతూ.. వర్షాధారం కింద వ్యవసాయం చేసే రైతులు విధిగా పంట మార్పిడి చేయాలని సూచించారు. మిశ్రమ పంటలు, అంతర పంటలు వేసుకోవడం వల్ల అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment