కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా నియమితులయ్యేందుకు అదే బ్యాంకులో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న నాగిరెడ్డి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తనను సీఈఓగా నియమించాలని ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు, సహకరించాలని వ్యవసాయ, అనుబంధ శాఖలు, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు టీజీ భరత్, ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఆప్కాబ్ చైర్మన్‌లకు ప్రత్యేకంగా లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది. ఖాళీ గా ఉన్న డీసీసీబీ సీఈఓ పోస్టును భర్తీ చేసేందుకు గత ఏడాది ఆప్కాబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో డీసీసీబీ డీజీఎం నాగిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది నవంబరులో జరిగిన ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యారు. అయితే, ఆయనపై కొందరు ఫిర్యా దులు చేయడం వల్ల సీఈఓ ప్యానల్‌లో చోటు దక్కలేదు. యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియాలో జీఎంగా పని చేసి పదవీ విరమణ చేసిన వెంకటేశ్వరస్వామిని డిసెంబరు నెల చివరిలో డీసీసీబీ సీఈఓగా నియమించారు. అయితే, ఈ పోస్టులో ఆయన చేరలేదు. ఇటీవల నాట్ ఇంట్రెస్ట్ అంటూ డీసీసీబీకి సమాచారమిచ్చారు. దీంతో డీజీఎం నాగిరెడ్డి మళ్లీ తన ప్రయత్నాలను ప్రారంభించారు. ఇటీవల ఆప్కాబ్ ఎండీ, మంత్రులకు తనను సీఈఓగా నియమించాలని కోరుతూ లేఖ రాసినట్లు డీసీసీబీలో జోరుగా చర్చ జరుగుతోంది. యూబీఐ అనుమతి లేకపోయినప్పటికీ వెంకటేశ్వరస్వామిని ఇంటర్వ్యూకు పిలువడం, సీఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంలో పొరపాటు చేశారని లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. తాను దివ్యాంగుడినని, దీనిని దృష్టిలో పెట్టుకొని సీఈఓగా అవకాశం కల్పించాలని ఆప్కాబ్ ఎండీ, మంత్రులను కోరినట్లు తెలిసింది.
డీజీఎం నాగిరెడ్డి ముమ్మర యత్నాలు
ఆప్కాబ్ ఎండీతో సహా చైర్మన్,
మంత్రులకు లేఖలు
Comments
Please login to add a commentAdd a comment