ఉరుకుంద క్షేత్రం .. ఉత్సవ వైభవం
● రెండవరోజు శాస్త్రోక్తంగా
సాగిన హోమాలు
● కనుల పండువగా గ్రామోత్సవం
● ఆకట్టుకున్న సంప్రదాయ ప్రదర్శనలు
నందికోలు ప్రదర్శన
మంత్రాలయం/కౌతాళం: వేద మంత్రాలు.. మంగళవాయిద్యాలు, కోలాటాలు, నందికోల, వీరభద్ర వేషధారుల ప్రదర్శనలతో ఉరుకుంద క్షేత్రం పులకించింది. ఈరన్న స్వామి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా రెండో రోజు ఆదివారం ఉదయం యాగశాలలో వైశాగమ ప్రవీణ సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో రుద్రహోమం, చండీహోమం, మహా సుదర్శన హోమం, మృత్యుంజయహోమం, శాంతి హోమాలు నిర్వహించారు. అనంతరం ధాన్యధివాసంలో ఉన్న విగ్రహాలు, కలశాలకు సంప్రోక్షణ, పంచామృతాభిషేకం చేశారు. అక్కడి నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక కొలను వరకు ఊరేగింపుగా చేరుకుని దేవతామూర్తులు, కలశాలను జలాధివాసం చేశారు. ఈ ఘట్టం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సాయంత్రం వేద ఘోషతో యాగశాల మార్మోగింది. ఆలయ డిప్యూ టీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలను జిల్లా డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ పర్యవేక్షించారు. ఏర్పాట్లపై ఆరా తీసి విగ్రహాలను పరిశీలించారు. ఉత్సవాల్లో భాగంగా రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై రాత్రి కల శాలు, దేవతా విగ్రహాలకు ఉంచి ఆలయం ప్రధాన ముఖద్వారం నుంచి అర కిలోమీటర్ దూరంలోని ఉరుకుంద గ్రామం వరకు ఊరేగింపు నిర్వహించారు.
నేడు మహా కుంభాభిషేకం
వేడుకలో భాగంగా సోమవారం మహా కుంభాభిషే కం ఘట్టాన్ని నిర్వహించనున్నారు. నూతన రాజగోపురాలపై కలశాలను ప్రతిష్టించి సప్తనదుల మంత్రజలంతో అభిషేకం గావిస్తారు. వేడుక సందర్భంగా కర్ణాటకకు చెందిన భక్తుడు మంజునాథ్ హెలికాప్టర్ తో పుష్పవృష్టి కురిపించనున్నారు. వేడుకను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. అలాగే ఆలయ ముంగిట, దేవతామూర్తుల ప్రతిష్టాపన, నవగ్రహాల మంటప ప్రారంభం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment