![చిన్నగూడూరు మండలంలో రాలిన మామిడి కాయలను ఏరుతున్న రైతులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/23/22drk355-330156_mr_0.jpg.webp?itok=YQX9yeYs)
చిన్నగూడూరు మండలంలో రాలిన మామిడి కాయలను ఏరుతున్న రైతులు
సాక్షి, మహబూబాబాద్: రైతన్నపై ప్రకృతి పగబట్టింది. ఆరుగాలం కష్టపడి సాగుచేస్తే పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన రూపేన రైతును నట్టేట ముంచింది. శుక్రవారం అర్థరాత్రి వీచిన ఈదురుగాలులు, వడగండ్ల వానతో కోతకు వచ్చిన మామిడి కాయలు నేలరాలగా.. మిర్చి, వరి, మొక్కజొన్న, పెసర పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట చేయిజారి పోయిందని పెట్టుబడి, చేసిన కష్టం కూడా నీటి పాలైందని అన్నదాత కన్నీరు మున్నీరు పెడుతున్నారు.
11,241 ఎకరాల్లో పంట నష్టం..
శుక్రవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా కురిసిన వడగండ్ల వానతో 67 గ్రామాల్లో ఈదురు గాలుల ప్రభావం కన్పించింది. 3,139 మంది రైతులు సాగుచేసిన 11,241 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఈ పంటల నష్టం విలువ రూ.5కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నా.. అదిరెట్టింపు ఉండే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. పలుచోట్ల రేకుల ఇళ్లు కప్పులేచిపోవడం, విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతోపాటు, పిడుగుపాటుతో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయాలపాలయ్యారు. ఇందులో 855 ఎకరాల మొక్కజొన్న, 6,530ఎకరాల్లో వరి, 290ఎకరాల్లో పెసర, 10 ఎకరాల్లో నిమ్మ, ఎనిమిది ఎకరాల్లో బొప్పాయితోపాటు అత్యధికంగా 3,548 ఎకరాల్లో మామిడి తోటల్లో కాయలు రాలి పోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. మహబూబాబాద్, మరిపెడ, చిన్నగూడూరు, నర్సింహులపేట, దంతాలపల్లి, కురవి, సీరోలు, డోర్నకల్ మండలాల్లో ఎక్కువగా పంటల నష్టం జరిగినట్లు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల ప్రాథమికంగా అంచనా. అయితే పంటనష్టం అంచనా రూ.2.56కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
గాలివాన బీభత్సం
కురవి: సీరోలు, కురవి మండలాల్లోని గ్రామాల్లో శుక్రవారం అర్ధరాత్రి అకాలంగా గాలివాన భీభత్సాన్ని సృష్టించింది. గాలివాన బీభత్సానికి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కురవి మండలంలోని కందికొండ శివారు బంజర, లచ్చ తండాల్లో, బలపాల గ్రామాల్లో వందలాది ఎకరాల్లోని మామిడి తోటల్లోని కాయలు నేలరాలిపోయాయి. సీరోలు మండలంలోని ఉప్పరిగూడెం వద్ద ఖమ్మం రహదారిపై భారీ వృక్షం కూలిపోయి విద్యుత్ స్తంభాలు నేలపడ్డాయి. రమేష్ అనే వ్యక్తికి చెందిన రేకుల ఇళ్లు గాలికి ఎగిరిపడింది. కురవి మండలం కందికొండలో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. నేరడలో పలువురి ఇంటి పైకప్పు రేకులు గాలికి కొట్టుకుపోయాయి.
అపార నష్టం..
మరిపెడ రూరల్: శుక్రవారం రాత్రి వీచిన ఈదురు గాలులు, అకాల వర్షానికి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. మండలంలోని అబ్బాయిపాలెం, తండధర్మారం, పురుషోత్తమాయగూడెం, ఎడ్జెర్ల, చిల్లంచర్ల, రాంపురం, వీరారం గ్రామాల్లోని వందల ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి. అబ్బాయిపాలెంకు చెందిన కౌలు రైతు బోయిని మల్లయ్య 34 ఎకరాలు మామిడి తోటలను కౌలుకు తీసుకోగా.. కాయలన్నీ నేల రాలిపోవడంతో దిక్కుతోచనిస్థితిలోపడ్డాడు. మండల వ్యాప్తంగా సుమారు 2వేల ఎకరాల్లో మామిడి రాలిపోయాయని హార్టికల్చర్ అధికారి అనిత తెలిపారు. ఇదిలా ఉండగా.. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట నేలపాలు కావడంతోపాటు, పలు గ్రామాల్లో రేకుల ఇళ్లు పైకప్పు లేచిపోయాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడి, తీగలు తెగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మామిడి నష్టం మండలాల వారీగా..(ఎకరాల్లో)
వడగండ్ల వానతో
రాలిన మామిడి కాయలు
నేలకొరిగిన వరి, మొక్కజొన్న,
మిర్చి పంటలు
67 గ్రామాల్లో 11,241ఎకరాల
పంట నష్టం అంచనా..
ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన
వ్యవసాయ, ఉద్యానవన శాఖ
మండలం రైతులు పంటనష్టం
మరిపెడ 429 2,027
కురవి 255 867
మహబూబాబాద్ 56 214
నర్సింహులపేట 71 205
దంతాలపల్లి 7 42
డోర్నకల్ 15 60
చిన్నగూడూరు 27 130
మొత్తం 860 3,545
![మరిపెడ రూరల్: విరిగి పడిన విద్యుత్ స్తంభం 1](https://www.sakshi.com/gallery_images/2023/04/23/22drk255-330134_mr.jpg)
మరిపెడ రూరల్: విరిగి పడిన విద్యుత్ స్తంభం
Comments
Please login to add a commentAdd a comment