అకాల వర్షం.. రైతుల అవస్థలు | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. రైతుల అవస్థలు

Published Mon, May 6 2024 5:05 AM

అకాల

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అరబోసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు కురిశాయి. దీంతో రైతులు ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పుకోవడానికి అవస్థలు పడ్డారు. కాగా ధాన్యం రాశుల చుట్టూ వర్షపునీరు చేరి నిలిచింది. వ్యవసాయ మార్కెట్‌లో సైతం రైతులు ఇబ్బందులు పడ్డారు.

కూలిన విద్యుత్‌స్తంభం

డోర్నకల్‌: పెను గాలులు వీయడంతో డోర్నకల్‌ మండలంలోని శాంతినగర్‌ మీదుగా బుద్దారం వెళ్లే మార్గంలో ఆదివారం విద్యుత్‌ స్తంభం రోడ్డుకు అడ్డంగా కూలింది. ఈక్రమంలో విద్యుత్‌ తీగలు సమీపంలోని వేప చెట్టుపై పడటంతో రోడ్డుపై కూలింది. అలాగే మున్సిపల్‌ కార్యాలయం వీధిలో వార్డు కౌన్సిలర్‌ బోడ అమల ఇంటి ఎదుట చెట్టు పడడంతో విద్యుత్‌ తీగలు తెగి రోడ్డుపై పడ్డాయి.

బయ్యారంలో గాలివాన..

బయ్యారం:మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం గాలివానతో పలు చోట్ల చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి. బయ్యారం, రంగాపురం, జగ్గుతండా, చర్లపల్లి, కట్టుగూడెం, ఇర్సులాపురం తదితర గ్రామాల్లో గాలివాన వల్ల చెట్లు కూలిపోయాయి. బయ్యారం–ఇర్సులాపురం రహదారిపై కట్టుగూడెం వద్ద చెట్టు రహదారిపై పడిపోవటంతో రాకపోకలు స్తంభించాయి.

కూలిన ఎదరభాగం గోడ..

గార్ల: ఆదివారం ఈదులు గాలులకు రైల్వేస్టేషన్‌ భవనం ఎదర భాగం గోడ కూలిపోయింది. రైల్వే మూడో లైన్‌ మరమ్మతుల దృష్ట్యా ఈనెల 10వ తేదీ వరకు రైళ్ల రద్దుతో రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వేస్టేషన్‌ నేమ్‌ బోర్డు గోడ పూర్తిగా కూలిపోగా రేకులు లేచిపోయాయి.నిజాం కాలంలో నిర్మించిన రైల్వేస్టేషన్‌ భవనం శిథిలావస్థకు చేరుకుందని, నూతన భవనం నిర్మించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని గార్ల పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి రైల్వేస్టేషన్‌కు నూతన భవనం నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

రాళ్లవాన

చిన్నగూడూరు/మరిపెడ రూరల్‌: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో రాళ్ల వాన కురిసింది. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన రాళ్ల వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అలాగే మరిపెడ మండలం నీలికుర్తి గ్రామం శివారు రైతు వేదిక వద్ద తాటి చెట్టుపై ఆదివారం పిడుగు పడింది.

కేసముద్రం మార్కెట్‌లో..

కేసముద్రం: అకాల వర్షంతో ఆదివారం సాయంత్రం వ్యవసాయ మార్కెట్‌ యార్డుతోపాటు పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసిముద్దయ్యాయి. దీంతో రైతులు ఆగమాగమయ్యారు. అదే విధంగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షంతో ధాన్యం స్వల్పంగా తడిసింది.

రెతుల ఇబ్బందులు..

కురవి/దంతాలపల్లి/నర్సింహులపేట: కురవి, సీరోలు మండలాల్లోని పలు గ్రామాల్లో అకాల వర్షం కురిసింది. దీంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. అలాగే దంతాలపల్లి మండంలోని కుమ్మరికుంట్ల, రామానుజపురం, పెద్దముప్పారం, గున్నెపల్లి మోస్తరు వర్షం కురిసింది. అదేవిధంగా నర్సింహులపేటలో అకాల వర్షం కురిసి ధాన్యం తడిసింది.

అకాల వర్షం.. రైతుల అవస్థలు
1/4

అకాల వర్షం.. రైతుల అవస్థలు

అకాల వర్షం.. రైతుల అవస్థలు
2/4

అకాల వర్షం.. రైతుల అవస్థలు

అకాల వర్షం.. రైతుల అవస్థలు
3/4

అకాల వర్షం.. రైతుల అవస్థలు

అకాల వర్షం.. రైతుల అవస్థలు
4/4

అకాల వర్షం.. రైతుల అవస్థలు

Advertisement
Advertisement