పండుగ పూట.. దొంగల వేట
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పండుగ పూట జరుగుతున్న చోరీలు, చైన్ స్నాచింగ్ ఘటనలతో మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వారు రోడ్డుపై ఒంటరిగా వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు దుండగులు ముందస్తుగా రెక్కీ నిర్వహించి చైన్ స్నాచింగ్ చేస్తే.. మరికొందరు హఠాత్తుగా వచ్చి మహిళల మెడలోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి.
పలు కాలనీలు టార్గెట్..
దుండగులు పక్కా ప్రణాళికతో పలు కాలనీలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. ఆరు నెలల కాలంలో పట్టణంలోని బ్యాంకు కాలనీకి వెళ్లే దారిలోని ఆర్‌కే టవర్స్, కంకర బోర్డు కాలనీ, కృష్ణ కాలనీల్లో ఇప్పటి వరకు చైన్‌స్నాచింగ్ ఘటనలు జరిగాయి. అయితే ఆయా ప్రాంతాల్లోనే పోలీసు అధికారులు ఇళ్లు అద్దెకు తీసుకుని ఉండటం గమనార్హం.
పోలీసులకు సవాల్..
మహబూబాబాద్ పట్టణంలో దొంగలు హల్‌చల్ చేస్తూ.. పోలీసులకు చిక్కకుండా సవాల్ విసురుతున్నారు. గతంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు.. ప్రస్తుతం రూట్ మార్చుకొని చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. దొంగలను పట్టుకుని రికవరీ చేసే విషయంలో పోలీసులు విఫలం కావడంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దొంగతనాల కారణంగా ఊరెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గస్తీ పెంచి చోరీలను నివారించాలని కోరుతున్నారు.
ఆరు నెలల వ్యవధిలో జరిగిన
చైన్ స్నాచింగ్ ఘటనలు..
● మహబూబాబాద్ పట్టణంలోని బ్యాంకు కాలనీకి వెళ్లే దారిలోని ఆర్‌కే టవర్స్ సమీపంలో మే నెల 25న చైన్ స్నాచింగ్ జరిగింది. ఎలమరెడ్డి రమాదేవి వాకింగ్ వెళ్లి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలోని మూడు తులాల బంగారు పుస్తెల తాడును ద్విచక్రవాహనంపై ఓ అగంతకుడు ఎదురుగా వచ్చి లాక్కెళ్లిపోయాడు.
● పట్టణంలోని విద్యుత్ బిల్లుల చెల్లింపు కార్యాలయానికి వెళ్లే దారిలో నివాసం ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కెర రామాచారి భార్య ఉమాదేవి సెప్టెంబర్ 3వ తేదీ మధాహ్నం సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. ఈక్రమంలో ఓ ఆగంతకుడు ఆమె మెడలోని మూడు తులాల బంగారు పుస్తెల తాడు, తులం బంగారు చైన్ గుంజుకుని పారిపోయాడు.
● పట్టణంలోని కృష్ణ కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ ఉపాధ్యాయుడు మంగళపల్లి సోమయ్య సతీమణి సోమలక్ష్మి ఈ నెల 7వ తేదీన తమ మనవడిని ఇంటి ముందు ఆడించి ఇంట్లోకి తీసుకెళ్తోంది. ఇంటి మెట్టు ఎక్కుతుండగా బైక్‌పై ఓ దుండగుడు వచ్చి ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు, తులంన్నర బంగారు గొలుసును గుంజుకుని పారిపోయాడు.
చోరీల నియంత్రణకు చర్యలు
పట్టణంలో చైన్ స్నాచింగ్, ఇతర చోరీ ఘటనల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నాం. స్వయంగా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ రాత్రి సమయాల్లో ద్విచక్రవాహనంపై గస్తీ తిరుగుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరంలేకుండా పోలీసు బందోబస్తు కొనసాగిస్తాం. చోరీల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏ ర్పాటు చేసి నిఘా పెంచి గస్తీ నిర్వహిస్తున్నాం.
– తిరుపతిరావు, డీఎస్పీ
ఆరు నెలల వ్యవధిలో
మూడు చైన్ స్నాచింగ్ ఘటనలు
పండుగ వేళ భయాందోళనలో
మహిళలు
Comments
Please login to add a commentAdd a comment