బెట్టింగ్ యాప్‌లతో నష్టపోయి.. దొంగగా మారి
వరంగల్ క్రైం: బెట్టింగ్ యాప్‌లతో నష్టపోయిన ఓ వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగగా మారాడు. ఇందులో భాగంగా పగలు తాళం వేసిన ఇళ్ల పరిసరాల్లో రెక్కీ నిర్వహించి రాత్రి చోరీలకు పాల్పడుతున్నాడు. ఇలా కమిషనరేట్ పరిధిలో పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్న దొంగను సీసీఎస్, కేయూ పోలీసులు సంయుక్తంగా మంగళవారం అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. నిందితుడి నుంచి సుమారు రూ.28.50 లక్షల విలువైన 334 గ్రాముల బంగారు, కిలో 640 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.13వేల నగదు, ఒక ద్విచక్రవాహనం, ఒక సెల్‌ఫోన్, చోరీలకు ఉపయోగించే వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ మే రకు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన కొండపల్లి ధర్మరాజు ప్రస్తుతం హనుమకొండ పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం కొంతకాల రాయపర్తి మండల కేంద్రంలో బిర్యానీ సెంటర్ నిర్వహించి నష్టపోయాడు. అనంతరం చదువుకుంటున్నానని చెప్పి హనుమకొండ పోస్టల్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. నష్టపోయిన డబ్బును తిరిగి పొందేందుకు వివిధ మార్గాల్లో వ్యక్తిగత రుణాలు తీసుకుని ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాల్గొన్నాడు. ఇందులో మరింత నష్టపోయి తీసుకున్న రుణాలకు వాయిదాలు చెల్లించలేక పూర్తిగా అప్పులపాలయ్యాడు. దీంతో తన అప్పులు తీర్చడంతోపాటు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా పగలు తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి ఆ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. ఇలా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 17 చోరీలకు పాల్పడ్డాడు. ఈ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి అత్యాధునిక టెక్నాలజీతో నిందితుడుని గుర్తించడంతో పాటు అతడిపై నిఘా పెట్టారు. నిందితుడు తాను చోరీ చేసిన చోరీ సొత్తు విక్రయించేందుకు కేయూ వైపునకు వస్తున్నట్లు సమాచారం రావడంతో సీసీఎస్, కేయూ పోలీసులు సంయుక్తంగా కేయూ క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాలు అంగీకరించాడు. దీంతో అతడి నుంచి పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారని సీపీ తెలిపారు.
కమిషనరేట్ పరిధిలో 17 చోరీలకు పాల్పడిన దొంగ అరెస్ట్
334 గ్రాముల బంగారం, 1.640 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment