చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి
సంగెం: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సంగెం మండలం ఆశాలపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జనగాం ప్రవీణ్‌కుమార్, జయశ్రీ దంపతులకు కూతురు ప్రణతి, కుమారుడు ప్రభాస్ (20) ఉన్నారు. ప్రవీణ్‌కుమార్ గీత వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 26వ తేదీన తన మిత్రుడు వరంగల్‌కు చెందిన బిల్లా నూర్‌దాస్‌తో కలిసి తన మేనత్త పెద్దగోని కవిత ఊరు ఎల్గూర్‌రంగంపేటకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. అదేరోజు సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో సంగెంలోని కేజీబీవీ సమీపంలో ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి చెట్టుకు ఢీకొన్నారు. ఈ ఘటనలో ప్రభాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో 108లో ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ప్రవీణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
కాల్వలో పడి వ్యక్తి ..
డోర్నకల్: మండలంలోని చిలుకోడు శివారు మోడల్ స్కూల్ సమీపంలో ఓ వ్యక్తి ఎస్సారెస్పీ కాల్వలో పడి మృతి చెందాడు. చిలుకోడు గ్రామానికి చెందిన వడ్డూరి వెంకన్న(47) మోడల్ స్కూల్‌లో నైట్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తుండగా భార్య పద్మ అదే పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట కార్మికురాలిగా పని చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి విధులు ముగించుకున్న వెంకన్న మంగళవారం బైక్‌పై ఇంటికి వస్తూ పాఠశాల సమీపంలో ఎస్సారెస్పీ కాల్వ మోరీపై కూర్చున్నాడు. ఆ సమయంలో అస్వస్థతకు గురికావడంతో మోరీ పైనుంచి కాల్వలో పడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు వెంకన్నను బయటకు తీశారు. 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునే సమయానికి వెంకన్న మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment