పింఛన్ తీసుకొని వస్తూ మృత్యుఒడికి..
● కారు ఢీకొని వృద్ధురాలి దుర్మరణం ● కోమల్ల వద్ద ఘటన
రఘునాథపల్లి: పింఛన్ తీసుకొని వస్తున్న ఓ వృద్ధురాలిని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందింది. ఈ ఘటన హనుమకొండ– హైదరాబాద్ జాతీయ రహదారిపై కోమల్ల వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కోమల్ల శివారు చింతలగూడేనికి చెందిన కొడిపెల్లి లక్ష్మి (85) మంగళవారం గ్రామంలో పింఛన్ తీసుకుని గ్రామానికి చెందిన బండి భారతమ్మతో కలిసి ఇంటికి వస్తోంది. మార్గమధ్యలోని జాతీయ రహదారిని ఇరువురు దాటే క్రమంలో హైదరాబాద్ నుంచి హనుమకొండ వైపునకు వెళ్తున్న కారు వారిని ఢీకొంది. దీంతో లక్ష్మి, భారతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. భారతమ్మ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు కొడిపెల్లి నర్సింహారెడ్డి ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ బానోత్ సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు.
రాఘవాపూర్‌లో వ్యక్తి..
స్టేషన్‌ఘన్‌పూర్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కారు వెనుకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం మండలంలోని రాఘవాపూర్‌లో జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాసాని ఉప్పలయ్య(57) ఇదే గ్రామానికి చెందిన ఎండీ కమర్‌కు పాలేరుగా పని చేస్తున్నాడు. ఉప్పలయ్యతో పాటు ఇదే గ్రామానికి చెందిన గాదెపాక యాదగిరి జాతీయ రహదారిపై నడుచుకుంటూ కమర్ వ్యవసాయ భూమి వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో హనుమకొండ నుంచి జనగామ వైపునకు వెళ్తున్న కారు వెనుక నుంచి వీరిని ఢీకొంది. ఈప్రమాదంలో ఉప్పలయ్య అక్కడికక్కడే మృతిచెందగా యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు వెంటనే ఉప్పలయ్య కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. యాదగిరిని 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. ఈ ఘటనపై ఉప్పలయ్య కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ సోమరాజు కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు.
వరంగల్ మార్కెట్‌కు నాలుగు రోజులు సెలవు
వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజులు సెలవు ఉందని, ఈ సమయంలో యార్డుల్లో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పి.నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. 31వ తేదీ దీపావళి పండుగ(గురువారం), 1వ తేదీ అమావాస్య(శుక్రవారం), 2న వారాంతపు యార్డు బంద్(శనివారం), 3న వారాంతపు సెలవు(ఆదివారం) ఉన్న నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గమనించి రైతులు, వ్యాపారులు, కార్మికులు, హమాలీలు సరుకులు తీసుకురావొద్దని కోరారు. మార్కెట్ 4వ తేదీ సోమవారం పునఃప్రారంభమతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment