మార్కెట్‌ను సందర్శించిన డీఎస్పీ
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ను మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు మార్కెట్ యార్డును ఏఎంసీ చైర్మన్ గంట సంజీవరెడ్డితో కలిసి పరిశీలించారు. మార్కెట్‌కు ధాన్యం అధికంగా వస్తున్నందున త్వరితగతిన కొనుగోళ్లు జరిగేలా చూడాలని డీఎస్పీ సూచించారు. మార్కెట్‌లో ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజు, మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్‌రావు, గ్రేడ్–3 సెక్రటరీ రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
16 వేల
ధాన్యం బస్తాల రాక
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు 16,608 ధాన్యం బస్తాలు గురువారం అమ్మకానికి వచ్చాయి. మార్కెట్‌లో ఈసీజన్‌లో అత్యధికంగా ధాన్యం అమ్మకానికి రావడం ఇదే మొదటిసారి. దీంతో షెడ్లన్నీ ధాన్యం రాశులతో నిండిపోగా, ఓపెన్‌యార్డుల్లో ధాన్యాన్ని రాశులుగా పోసుకున్నారు. అత్యధికంగా ధాన్యం రావడంతో టెండర్‌లు కొంత ఆలస్యమయ్యాయి. కాంటాలు సాయంత్రం ప్రారంభించగా, తొలకాలు రాత్రి వరకు జరిగాయి. కాగా మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యానికి రెండు రోజుల వ్యవధిలో క్వింటాకు ధర రూ.278 తగ్గడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
వివరాల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి
దంతాలపల్లి: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో స్వీకరించిన వివరాల నమోదు ప్రక్రియను శుక్రవారం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తొర్రూరు ఆర్డీఓ గణేష్ అన్నారు. మండల పరి షత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత స మయంలో డేటా ఎంట్రీని పూర్తి చేస్తే.. ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కాటం చంద్ర రాజేశ్వర్, ఎంపీడీఓ వివేక్‌రామ్, ఎంపీఓ అప్సర్‌పాషా, సిబ్బంది పాల్గొన్నారు.
రేపు జాబ్‌మేళా
మహబూబాబాద్: కలెక్టరేట్‌లోని జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో ఈనెల 30న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఽశ్రీసాయి అగ్రిటెక్నాలజీ కంపెనీలో ఫీల్డ్ స్టాఫ్, మార్కెటింగ్ సేల్స్ ఆఫీసర్‌గా జిల్లా పరిధిలో పని చేసేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్ ఆపై విద్యార్హతతో ద్విచక్రవాహనంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
న్యాస్ పరీక్షలు పక్కాగా నిర్వహించాలి
తొర్రూరు: న్యాస్ పరీక్షలు ఎలాంటి లోపాలు లేకుండా పక్కాగా చేపట్టాలని జిల్లా సెక్టోరల్ అధికారి ఆజాద్ చంద్రశేఖర్ తెలిపారు. నాస్ పరీక్షలకు ఎంపికై న డివిజన్ కేంద్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను గురువారం జిల్లా సెక్టోరియల్ అధికారి సందర్శించారు. హెచ్‌ఎంలకు పలు సూచనలు చేశారు. డిసెంబర్ 4న జరిగే నాస్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసి వారి అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చాలని తెలిపారు. 3, 6, 9 తరగతుల విద్యార్థులకు అభ్యసన సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కొత్తగూడ/గంగారం: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డీఏఓ విజయనిర్మల అన్నారు. గురువారం కొత్తగూడ, గంగారం మండలాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సన్నధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడం వల్ల రైతులకు అదనంగా బోనస్ రూ.500 వస్తుందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తేమ శాతం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment