వీడని సందిగ్ధం.. | - | Sakshi
Sakshi News home page

వీడని సందిగ్ధం..

Published Wed, Jan 22 2025 1:33 AM | Last Updated on Wed, Jan 22 2025 1:33 AM

వీడని సందిగ్ధం..

వీడని సందిగ్ధం..

యథాస్థితిలో డీసీసీబీ భవన లీజ్‌ అంశం

బిల్లుల చెల్లింపుల్లో లేని స్పష్టత

ఈ బిల్లులు ఎప్పటి వరకు చెల్లిస్తారనే అంశంలో స్పష్టత లేదు. ఎఏ వాయిదాల్లో చెల్లిస్తారో చెప్పలేదు. ఈ బిల్లు చెల్లించే వరకూ వివాదం సద్దుమణిగేలా లేదు. దీనికి తోడు జేబీఎన్‌ స్టోన్‌ క్రషర్స్‌ హైకోర్టులో దాఖలు చేసిన కేసు విచారణ కొనసాగుతోంది. దీనిని బట్టి వరంగల్‌ డీసీసీబీ భవన లీజ్‌పై సందిగ్ధత ఇంకా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. హైకోర్టు తీర్పు వెలువడితేనే భవన లీజ్‌ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే లీజ్‌దారునకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఆర్‌బీఐ, బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం ప్రకారం లీజ్‌ ఇవ్వొద్దనే నిబంధన ప్రతిబంధకంగా మారే అవకాశముంది. దీంతో డీసీసీబీ తిరిగి అప్పీల్‌కు గాని, సుప్రీంకోర్టును గాని ఆశ్రయించే అవకాశం ఉంది.

హన్మకొండ : వరంగల్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు భవన లీజ్‌ అంశంపై సందిగ్ధం వీడడం లేదు. ఈ అంశం హైకోర్టులో విచారణ ఉండడంతో యథా స్థితి కొనసాగుతోంది. భవన నిర్మాణానికి అయిన ఖర్చులను నిర్మాణ సంస్థ నల్లవెల్లి కన్‌స్ట్రక్షన్స్‌కు చెల్లించాలని హైకోర్టు.. వరంగల్‌ డీసీసీబీని ఆదేశించింది. దీంతో లీజ్‌ వ్యవహారం కొలిక్కివచ్చి నట్లు అందరు భావించారు. అయితే నల్లవెల్లి కన్‌స్ట్రక్షన్‌కు.. భవనం లీజ్‌కు ఎలాంటి సంబంధం లేదనే విషయం సుస్పష్టం.

అప్పటి పాలకవర్గంపై ఆరోపణలు

ఈ క్రమంలో అప్పటి పాలకవర్గంపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్‌ జి.శ్రీనివాస్‌రావును విచారణ అధికారిగా నియమించింది. శ్రీనివాస్‌రావు బ్యాంకులో అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా భవానాన్ని లీజ్‌కు ఇచ్చారని నివేదిక సమర్పించారు. ఫలితంగా డీసీసీబీ భవనం లీజ్‌ అంశం వివాదాస్పదమైంది. బ్యాంకు ఆస్తులు లీజ్‌కు ఇవ్వొద్దని నిబంధనలున్నాయని, లీజ్‌కు ఇచ్చేది లేదని డీసీసీబీ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు సాగిన భవన నిర్మాణ పనులు నిలిచాయి. దీంతో తమతో ఒప్పందం చేసుకున్న మేరకు లీజ్‌కు ఇవ్వాలని జేబీఎన్‌ స్టోన్‌ క్రషర్స్‌ హైకోర్టుకు వెళ్లింది. దీనిపై డీసీసీబీ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో యథాస్థితిని కొనసాగించాలని హైకోర్టు స్టేటస్‌ కో ఇచ్చింది.

బిల్లుల చెల్లింపును

సెటిల్‌ చేసుకోవాలని కోర్టు ఆదేశం

ఇదిలా ఉండగా బిల్లులు చెల్లించకుండా ఈ అంశం కోర్టులో ఉందని డీసీసీబీ తిప్పించుకుంటుండడంతో నల్లవెల్లి కన్‌స్ట్రక్షన్‌ 2017లో హైకోర్టును ఆశ్రయించగా 2024 మార్చి 4న బిల్లుల చెల్లింపును సెటిల్‌ చేసుకోవాలని ఆదేశించింది. దీంతో 2024 మార్చి 19న జరిగిన పాలకవర్గ సమావేశంలో బి ల్లుల చెల్లింపు సెటిల్‌ చేసేందుకు ఏడుగురు సభ్యు ల (డైరెక్టర్లు)తో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మొత్తం బిల్లు వడ్డీతో కలుపుకుని రెండు వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.3,23,93,099 చెల్లించేలా 2024 అక్టోబర్‌ 8న జరిగిన బ్యాంకు పాలక మండలిలో ప్రత్యేక కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని తీర్మానించింది. ఈ మొత్తాన్ని రెండు వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ తీర్మానాన్ని సోమవారం జరిగిన మహాజన సభలో ప్రవేశ పెట్టి ఆమోదం పొందారు.

జేబీఎన్‌ స్టోన్‌ క్రషర్‌కు అద్దెకు భవనం.. లీజ్‌దారుకు అనువుగా భవన

నిర్మాణానికి ఒప్పందం

నల్లవెల్లి కన్‌స్ట్రక్షన్‌కు పనులు అప్పగింత

ఇంతలోనే లీజ్‌పై వివాదం..

నిబంధనలకు విరుద్ధమని డీసీసీబీ పేచీ

ఒప్పందం మేరకు లీజ్‌కు ఇవ్వాలని జేబీఎన్‌ స్టోన్‌ క్రషర్‌, చేసిన పనికి

బిల్లులు చెల్లించాలని హైకోర్టుకు వెళ్లిన నల్లవెల్లి కన్‌స్ట్రక్షన్‌

లీజ్‌పై కొనసాగుతున్న విచారణ

25 సంవత్సరాల కాలపరిమితికి లీజ్‌

హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ స్థలంలో ప్రధాన కార్యాలయం కోసం ఆ బ్యాంకు భవన నిర్మాణం చేపట్టింది. ఇందులో కొంత భవనాన్ని ప్రధాన కార్యాలయానికి, నక్కలగుట్ట బ్రాంచీ కోసం వాడుకుంటుంది. మిగతా భవనం స్కెల్‌టన్‌గా (పిల్లర్లు, పై కప్పుతో) వృథాగా ఉండడంతో అప్పటి పాలక వర్గం 2015 ఫిబ్రవరి 19న లీజ్‌కు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జేబీఎన్‌ స్టోన్‌ క్రషర్స్‌కు 25 సంవత్సరాల కాలపరిమితికి లీజ్‌కు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. ముందు రూ.3 కోట్లు డిపాజిట్‌ చేయాలని, స్కెల్‌టన్‌గా ఉన్న భవనాన్ని లీజ్‌దారునకు అనువుగా నిర్మించి ఇవ్వాలని డీసీసీబీ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు నల్లవెల్లి కన్‌స్ట్రక్షన్‌కు భవన నిర్మాణ పనులు అప్పగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement