పాండురంగారావుకు గవర్నర్ ప్రతిభాపురస్కారం
హన్మకొండ కల్చరల్ : ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలు, చెరువులు, కుంటల పరిరక్షణ, వారసత్వ సంపద కాపాడుకోవాంటూ అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన జిల్లాకు చెందిన ఇంటాక్ కన్వీనర్, నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రతిభా పురస్కారానికి –2024కు ఎంపికయ్యారు. గణతంత్రదినోత్సవ సందర్భంగా ఆయన.. గవర్నర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోనున్నారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకతీయ వారసత్వ సంపద, ప్రాచీనకట్టడాలు, చెరువుల పరిరక్షణపై, రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు పొందడానికి పాండురంగారావు విశేష కృషి చేశారు. జిల్లాలో చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారని 2010లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో ిఫిల్ దాఖలు చేశారు. దీంతో 2012–13లో సుప్రీం కోర్టు కూడా దేశవ్యాప్తంగా చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్‌టీఎల్) ఖరారు చేయడం విశేషం. రామజన్మభూమి ఫౌండేషన్స్‌కు కాకతీయ టెక్నాలజీ వాడాలని సూచనలు చేశారు. ఈ మేరకు గవర్నర్ ప్రతిభా పురస్కారాల్లో భాగంగా హెరిటేజ్, కల్చర్ విభాగంలో ఇద్దరిని ఎంపికచేశారు. ఇందులో పాండురంగారావుతో పాటు హైదరాబాద్‌కు చెందిన సంస్కృతి ఫౌండేషన్‌కు చెందిన పీబీ కృష్ణభారతి పురస్కారం అందుకోనున్నారు.
సాయం చేయడమే నిజమైన దేశసేవ
● రాష్ట్ర నీటిపారుదల శాఖ
ముఖ్య సలహాదారు ఆదిత్యనాథ్ దాస్
మంగపేట: తోటి వారికి సాయం చేయడమే నిజమైన దేశసేవని 100 ఫర్ 100 స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్, రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. మంగళవారం 100 ఫర్ 100, నళిని ఫౌండేషన్, రోటరీ క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో 2001 ఫిబ్రవరి 12న ఏటూరునాగారం ఐటీడీఏ పాలకమండలి సమావేశానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో చిన్నబోయిన పల్లి సమీపంలో జరిగిన దాడిలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మ దయతో ప్రాణంతో బయటపడిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే ఈ ప్రాంతానికి తనవంతు సేవ చేయాలనే దృక్పథంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. నళిని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విష్ణుకుమార్ శర్మ, వరంగల్ రోటరీక్లబ్ సభ్యుడు కుమారస్వామి, ఎంఈఓ పొదెం మేనక, హెచ్‌ఎం బాలాజీ, చందాభద్రయ్య, శ్రీనివాస్, మద్దెల నాగేశ్వరరావు, మాధురిదేవి, అనసూర్య, సునీత, వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment