రైతులకు ‘సద్దిమూట’
● ఆకలి తీరుస్తున్న సద్దిమూట కార్యక్రమం
● ఇటీవల మానుకోట వ్యవసాయ
మార్కెట్‌లో ప్రారంభం
● రూ.5కే భోజనం అందజేత
● పెరుగుతున్న ఆదరణ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో ఇటీవల ప్రారంభించిన సద్దిమూట కార్యక్రమంతో రైతుల ఆకలి తీరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో ప్రతీరోజు రైతులకు రుచికరమైన భోజనం అందిస్తోంది.
గత నెల 24న ప్రారంభం..
సద్దిమూట కార్యక్రమాన్ని జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అధికారికంగా ప్రారంభించారు. రైతుల ఆకలి తీర్చాలనే ముఖ్య ఉద్దేశంతో మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది.
చుట్టు పక్కల మండలాల రైతులు..
మహబూబాబాద్‌తో పాటు కురవి, సీరోలు, మరిపెడ, నెల్లికుదురు, కేసముద్రం, బయ్యారం, ఇల్లెందు, చిన్నగూడూరు మండలాల పరిధిలోని గ్రామాలకు చెందిన రైతులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వ్యవసాయ మార్కెట్‌కు వస్తుంటారు. ఈ క్రమంలో వారు ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండాలని సద్ది మూట కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ.5కే భోజనం అందిస్తూ ఆకలి తీరుస్తుండడంతో అన్నదాతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతీరోజు మార్కెట్‌కు రైతులు తీసుకువచ్చే సరుకులకు కేటా యించే లాట్ ఐడీల ప్రకారం టోకెన్లు జారీ చేస్తుండగా.. వాటి ఆధారంగా భోజనం తెప్పిస్తున్నారు. అవసరమైతే అదనంగా తెప్పిస్తున్నారు.
సద్దిమూట మెనూ ఇదే
వారం కర్రీలు
సోమవారం టమాట పప్పు, ఆలుగడ్డ
మంగళవారం కుకుంబర్ పప్పు, బెండకాయ టమాట
బుధవారం మిక్స్‌డ్ వెజ్ సాంబార్, టమాట మిల్‌మేకర్
గురువారం టమాట పప్పు, క్యారెట్
శుక్రవారం సోరకాయ పప్పు, క్యాబేజీ శనగపప్పు
శనివారం మిక్స్‌డ్ వెజ్ సాంబార్, రవ్వ కేసరి స్వీట్
ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నుంచి ప్రతీరోజు ప్రత్యేకంగా వాహనం ద్వారా మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు భోజనం వస్తుంది. ప్రభుత్వం ఒక్క భోజనానికి రూ.27.63 చెల్లించాలని నిర్ణయించగా రైతులు చెల్లిస్తున్న రూ.5పోను మిగతా మొత్తాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రతీ రైతుకు 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల పప్పు, 100 గ్రాముల కూర, 20 గ్రాముల పచ్చడి అందిస్తున్నారు. మార్కెట్ సెలవు దినాల్లో తప్ప మిగతా అన్ని రోజుల్లో రైతులకు సద్దిమూట భోజ నం అందుబాటులో ఉంటుంది. కాగా మెనూ ప్రకారం కూరగాయలు అందుబాటులో లేని సమయంలో వాటి స్థానంలో మరికొన్ని రకాల కూరగాయలతో కూరలు తయారుచేసి తీసుకువస్తున్నారు. ప్రతీరోజు భోజనంలో ఏదో ఒక రకమైన చట్నీ కూడా అందుబాటులో ఉంటుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, కార్యదర్శి షంషీర్, సూపర్‌వైజర్ రమేశ్, అసిస్టెంట్ సూపర్‌వైజర్ అరుణ్ కమార్ సద్దిమూట కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment