నేటి ప్రజావాణి రద్దు
మహబూబాబాద్: కలెక్టరేట్‌లో ఈనెల 3న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కావునా ప్రజలు గమనించి ప్రజావాణికి దరఖాస్తులతో కలెక్టర్ కార్యాలయం రావద్దని సూచించారు.
మిర్చికి కనీస మద్దతు ధర చెల్లించాలి
కురవి: మిర్చి పంటకు కనీస మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భీమానాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని కంచర్లగూడెం తండాలో మిర్చి కల్లం వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిర్చి రైతులు పంట సాగుచేసి పెట్టిన పెట్టుబడులు రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. మా ర్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. కనీస మద్దతు ధర రూ.25వేలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనునాయక్, మోహన్‌నాయక్, స్వప్నబాయి, సురేష్, నవీన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం
కురవి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణాకు మరోసారి తీరని అన్యాయం జరిగిందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు నల్లు సుధాకర్‌రెడ్డి ఆదివారం ఒకప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవని విమర్శించారు. బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి, ప్రత్యేక నిధుల కేటాయింపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకన్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఐఐఎం, ఐఐటీ, సైనిక్ పాఠశాలలు, కేంద్ర విద్యాసంస్థల ఊసేలేదన్నారు. ములుగులో తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి అరకొర నిధులు కేటాయించడం, యువకులకు ఉపాధి అవకాశాలు కలిగే బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రాజెక్టును మూలకు పడేయడం దారుణమన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ముందడుగు వేయడంలో అవసరమైన నిధులను కేటాయించలేదన్నారు.
నేటి నుంచి
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 3నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెక్షన్, మధ్యాహ్నం 2నుంచి సాయత్రం 5గంటల వరకు రెండో సెక్షన్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ద్వితీయ సంవత్సరంలో 3,342 మంది విద్యార్థులుల్ పరీక్షలు రాయనున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు 2305 మంది, ఒకేషన్ కోర్సులో 1037 మంది విద్యార్థులు, ఫస్టియర్ ఒకేషనల్ కోర్సులో 1199 మంది పరీక్షలు రాయనున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, మాల్‌ప్రాక్టిస్ జరగకుండా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
హేమాచలక్షేత్రంలో
భక్తుల సందడి
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఆలయంలో నిర్వహించే స్వామివారి తిల తైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆలయ అర్చకులు ఈశ్వర రామానుజ దాస్ స్వామివారికి నువ్వులనూనెతో పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు పూజారులు గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment