స్థానిక పోరుకు సన్నద్ధం
మహబూబాబాద్: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటరు జాబితా, ఇతర ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. దానికి అనుగుణంగా అధికారులు ఓటరు జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. జీపీల సంఖ్య తగ్గడంతో ఓటర్ల సంఖ్య కూడా తగ్గనుంది. కాగా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు ఉండడంతో అందుకు తగినవిధంగా మండలాలు, వార్డులు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, క్లస్టర్‌లు, బ్యాలెట్‌బాక్స్‌ల అవసరంపై అంచనా జాబితాను సిద్ధం చేసి కసరత్తు చేస్తున్నారు.
482జీపీలు..
జిల్లాలో 18 మండలాలు.. 487 గ్రామపంచాయతీలు ఉండగా ఇటీవల కేసముద్రం మేజర్ గ్రామపంచాయతీ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన విషయం విదితియే. దీంతో కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, ధనసరి, అమీనాపురం, సబ్‌స్టేషన్ జీపీలు కేసముద్రం మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. దీంతో జిల్లాలో జీపీల సంఖ్య 482కు తగ్గగా.. వార్డుల సంఖ్య 4,110 ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని ఎన్నికల అధికారుల ఆదేశాలతో గత ఏడాది ఆగస్టులో మొదటి సప్లిమెంటరీ జాబితాను, అదే ఏడాది సెప్టెంబర్ మాసంలో ఓటరు జాబితాను తయారు చేశారు. దాని ప్రకారం 2,76,608 మంది పురుష ఓటర్లు, 2,85,856 మంది మహిళా ఓటర్లు ఇతరులు 25.. మొత్తం 5,62,489 మంది ఉన్నారు. కాగా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
షెడ్యూల్ విడుదల..
ఈనెల 3న డ్రాఫ్ట్ సెకండ్ సప్లిమెంటరీ ఓటరు జాబితాను సిద్ధం చేసి జీపీలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈనెల 4న జిల్లాస్థాయిలో రాజకీయ నాయకులతో సమావేశాలు నిర్వహించాలని, 5న మండలస్థాయిలో నిర్వహించాలని పేర్కొన్నారు. ఈనెల 4, 5వ తేదీల్లో ఆజాబితాపై అభ్యంతరాలు, 6న పరిష్కారం చేయాల్సి ఉంది. ఈనెల 7న సెకండ్ సప్లమెంటరీ ఓటరు తుది జాబితాను సిద్ధం చేసి ప్రదర్శించాలి. జీపీల సంఖ్య తగ్గడంతో మొదటి కంటే రెండో సప్లిమెంటరీలో ఓటర్ల సంఖ్య తగ్గుతుందని అధికారులు తెలిపారు. జిల్లాకు 1800లకు పైగా బ్యాలెట్ బాక్స్‌లు రాగా వాటిని రిపేర్ చేసి సిద్ధం చేసే పనుల్లో డీపీఓ అధికారుల నిమగ్నమయ్యారు.
మూడు విడతల్లో
గతంలో జిల్లాలో మూడు విడతల్లో జీపీ ఎన్నికలు జరిగాయి. దీని ప్రకారమే ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే సంకేతాలతో అంచనా జాబితాను సిద్ధం చేశారు. మొదటి విడతలో చిన్నగూడూరు, దంతాలపల్లి, బయ్యారం, గార్ల, నర్సింహులపేట, పెద్ద వంగర, తొర్రూరు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, సీరోలు, మరిపెడ మండలాలు ఉన్నాయి. మూడో విడతలో గూడూరు, కేసముద్రం, ఇనుగుర్తి, మానుకోట, నెల్లికుదురు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా అందుకు సిద్ధంగా ఉండాలనే ఆదేశాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
అధికారుల ఆదేశాల మేరకు..
ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు అన్ని సిద్ధం చేస్తున్నాం. ముందుగా ఓటరు జాబితాపై కసరత్తు చేస్తున్నాం. ఈనెల 3న డ్రాఫ్ట్ సెకండ్ జాబితా ఏర్పాటు చేస్తాం. రాజకీయ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తాం. బ్యాలెట్ బాక్స్‌లు ఇతరత్రా సిద్ధం చేస్తున్నాం.
–హరిప్రసాద్, డీపీఓ
రెండో సప్లిమెంటరీ ఓటరు జాబితా తయారీలో నిమగ్నం
కేసముద్రం మున్సిపాలిటీతో తగ్గిన గ్రామ పంచాయతీలు
జిల్లాలో 482 జీపీలు 4,110 వార్డులు
మహిళా ఓటర్లే అధికం
బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేస్తున్న అధికారులు
ఎన్నికలకు సన్నద్ధం కావాలి
ఈనెల 1వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో జీపీ ఎన్నికలపై కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల వ్యయ పరిశీలనకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment