యుద్ధ ప్రాతిపదికన పనులు..
ఎస్‌ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ జాతర (మండమెలిగె)కు ఇంకా వారం రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో పనులు చకచకా కొనసాగుతున్నాయి. కాగా, ఈనెల 3వ తేదీ వరకు మేడారం మినీ జాతర పనుల పూర్తికి రాష్ట్ర మంత్రి సీతక్క డెడ్‌లైన్ విధించారు. దీంతో ఆయా శాఖల అధికారులు సోమవారం ఏర్పాట్లను పరిశీలించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
హైమాస్ట్ లైట్ల ఏర్పాటు
తల్లుల గద్దెల ప్రాంగణంలో విద్యుత్ వెలుగుల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. గద్దె చుట్టూ సాలహారంపై , గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. నేటి (మంగళవారం)తో విద్యుదీకరణ పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సారలమ్మ గుడి స్లాబ్‌పై మరమ్మతులు
కన్నెపల్లిలోని సారలమ్మ గుడిపై పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించి మరమ్మతులు చేపట్టారు. గుడి భవనంపై చెట్టు కొమ్మలు విరిగి ప డినట్లు వదంతులు వచ్చాయి. పూజారులు మాత్రం అలాంటిది ఏమి జరగలేదని, స్లాబ్ పై పిచ్చిమొక్కలు తొలగించి సిమెంట్‌తో మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఈఓ రాజేంద్రంను వివరణ కోరగా చెట్టు కొమ్మలు విరిగి ఆలయ స్లాబ్ పై పడినట్లు వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు.
ఇసుక దిబ్బలను తలపిస్తున్న
జంపన్నవాగు..
మేడారం జాతర సందర్భంగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే వాగు ప్రస్తుతం చుక్క నీరు లేకుండా ఎండిపోయి ఇసుక దిబ్బలను తలపిస్తోంది. దీంతో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరుగనున్న మినీ జాతరకు అధికారులు నీటి ఏర్పాట్లు చేస్తున్నారు. 2023లో జరిగిన మినీ జాతర సమయంలో వాగులో కొంత మేర నిల్వ నీరు ఉంది. ఈ సారి జాతరకు మాత్రం చుక్క నీరు కనిపించడం లేదు. దీంతో ఇరిగేషన్ అధికారులు జంపన్నవాగు స్నాన ఘట్టాలపై షవర్లు ఏర్పాటు చేసి భక్తులు జల్లు స్నానాలు చేసేలా పనులు చేపడుతున్నారు. కాగా, పగిడాపూర్ చెక్ డ్యాం, లక్నవరం నుంచి కొంత నీటి విడుదల చేస్తే భక్తులు వాగులోనే పుణ్యస్నానాలు చేసే వీలుంటుందని పూజారుల అభిప్రాయ పడుతున్నారు.
మినీ జాతరకు వారమే గడువు
చకచకా కొనసాగుతున్న పనులు
Comments
Please login to add a commentAdd a comment