సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి
మహబూబాబాద్: ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ వరప్రసాద్ అన్నారు. స్థానిక ఐఎంఏ హాల్‌లో సోమవారం ఐఆర్‌సీఎస్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు జూనియర్ రెడ్ క్రాస్ కిట్స్ అందజేసి, విధి విధానాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఆర్‌సీఎస్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈవీ శ్రీనివాస్, డాక్టర్ నెహ్రూ, వెంకట్‌రెడ్డి, బిక్కి వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: అర్హులైన దివ్యాంగులు సదరం స్లాట్ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మధుసూదన్‌రాజ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాలో ఉన్న అన్ని మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని, స్లాట్‌లో వచ్చిన తేదీల ప్రకారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో హాజరుకావాలని ఆయన కోరారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ షురూ..
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి విడతలో 17 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల మధ్య విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలురు కళాశాల, నలంద జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను డీఐఈఓ మదార్‌గౌడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటిరోజు పరీక్షలకు జనరల్ విద్యార్థులు 433 మందికి 423 మంది హాజరై.. 10 మంది గైర్హాజరయ్యాని తెలిపారు. అలాగే ఒకేషనల్ పరీక్షలకు 1509 మంది విద్యార్థులకు 1293 మంది హాజరయ్యారని, 216 మంది గైర్హాజరయ్యారన్నారు. ప్రతీ పరీక్ష గదిలో తప్పనిసరిగా సీసీ కెమెరాల మధ్య ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలన్నారు.
‘పల్లి’కి ప్రజల మద్దతు..
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పల్లికాయకు తక్కువ ధర పలుకుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. క్వింటాకు మద్దతు ధర రూ.6,783 ఉండగా.. మార్కెట్‌లో వ్యాపారులు రూ.5వేల నుంచి రూ.5,600 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. అయితే పల్లికాయ నిత్యావసరం కావడంతో స్థానిక ప్రజలు మార్కెట్‌కు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. రైతుల వద్ద నేరుగా కిలో రూ.70 చెల్లించి ఖరీదు చేస్తున్నారు. దీంతో మద్దతుకు మించి ధర వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం వ్యవసాయ మార్కెట్ యార్డులో పల్లిరాశుల వద్ద ప్రజలు పోటీపడి కొనుగోలు చేయడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment