వాహనదారుల పడిగాపులు
మహబూబాబాద్: రైల్వే మూడో లైన్ పనుల నేపథ్యంలో ఆర్‌యూబీని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఏ క్యాబిన్ గేట్ నుంచే వాహనదారులు వెళ్లాల్సి వస్తోంది. మానుకోటలో రైళ్ల హాల్టింగ్‌లు ఎక్కువగా ఉండటంతో గేట్ ఎక్కువ సమయం వేసి ఉండటంతో వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. గత్యంతరం లేక పట్టణానికి దూరంగా ఉన్న ఆర్వోబీ మీదుగా వెళ్తుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.
లక్షపైగా జనాభా..
మానుకోట మున్సిపాలిటీలో 68,889 మంది జనాభా ఉండగా విద్యా, వ్యాపారం, ఉద్యోగ రీత్యా ఇక్కడ నివాసం ఉండే వారితో కలిపితే లక్ష జనాభా దాటుతుంది. రోజు పలు పనుల నిమిత్తం మానుకోటకు వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. కాగా రైల్వే మూడో లైన్ పనుల వల్ల గత నెల 29న రైల్వే అండ్ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేసిన విషయం విదితియే. దాంతో వాహనదారులు, ప్రజలు, రోగులకు కష్టాలు మొదలయ్యాయి.
అనుకూలంగా ఏ క్యాబిన్ గేట్ మాత్రమే..
ఆర్‌యూబీని క్లోజ్ చేయడంతో ఏ క్యాబిన్ గేట్ మీదుగా వాహనదారులు వెళ్లాల్సి వస్తోంది. ఆ దారిగుండా భారీ వాహనాలు రాకుండా చర్యలు తీసుకున్నారు. కేవలం పాదచారాలు, వాహనదారులు వెళ్తున్నారు. ఆగేట్ వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులకు విధులు కేటాయించడంతో పాటు రాకపోకలు సాఫీగా జరిగేలా బారికేడ్లు ఏర్పాటుచేశారు. కాగా పక్కనే ఉన్న స్టేషన్‌లో రైళ్ల హాల్టింగ్‌తో ఎక్కువ సమయం గేట్ మూసి ఉండడంతో వాహనదారులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తలెత్తిన ట్రాఫిక్ సమస్య..
జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ఆర్వోబీ గుండా భారీ వాహనాలతో పాటు ఇతర వాహనాలు వెళ్తున్నాయి. ఒక్కటే మార్గం కావడంతో కురవి రోడ్డులో వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈక్రమంలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. కురవి రోడ్డులోనే (అనంతారం రోడ్డులో) రైల్వే ట్రాక్ కింద చిన్న బ్రిడ్జి మాదిరిగా ఉంది. దాన్ని వరద నీరు వెళ్లేలా ఏర్పాటు చేశారు. చిన్నచిన్న మరమ్మతులు చేస్తే చాలా వరకు ట్రాఫిక్ సమస్య తీరుతుంది. గతంతో ఆప్రాంతంలోని వారంతా దాని గుండానే వెళ్లేవారు. వినియోగంలోకి తేవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆర్‌యూబీ మూసివేతతో
తలెత్తిన ట్రాఫిక్ సమస్య
అధికారులు ఆలోచించాలని
వాహనదారుల విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment