మహబూబ్‌నగర్ రూరల్: షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న 59 కులాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అందించేలా ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని మాదిగలు పోరాటం చేస్తుంటే, మాలలు ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి కుట్రలు చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ, అనుబంధ సంఘాల జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీల జనాభాలో అత్యధిక జనాభా ఉన్నప్పటికీ తగినన్ని అవకాశాలు మాదిగలకు రాలేదని అన్నారు. అందుకే మాదిగలు మందకృష్ణ నేతృత్వంలో 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారని అన్నారు. ఈ పోరాట ఫలితంగానే న్యాయాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలుపుతూ చారిత్రక తీర్పును ఇచ్చిందని అన్నారు. ఈ తీర్పు ద్వారా ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమైందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది మాల సామాజిక వర్గంలోని స్వార్థపరులు ఇప్పటికీ అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకొచ్చేంత వరకు అన్ని రకాల ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7న మహబూబ్‌నగర్‌లో ఉమ్మడి జిల్లా మాదిగల ధర్మ యుద్ధ సభను నిర్వహిస్తున్నామని, ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ, ఎంఎస్‌పీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి జంగయ్య, నాయకుడు శ్రీరాములు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
గోవింద్ నరేష్
Comments
Please login to add a commentAdd a comment