అక్రమ కేసులతో ఇబ్బందులు: ఆర్‌ఎస్పీ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పాలమూరును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన శ్రీనివాస్‌గౌడ్ కుటుంబంతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం జైలులో ఉన్న శ్రీకాంత్‌గౌడ్‌తో ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముగ్గురు వ్యక్తులు దొంగ పట్టాలు చేశారని 2018లోనే కేసు నమోదైందని, తిరిగి వాళ్ల మీదనే మళ్లీ కేసు పెట్టి శ్రీకాంత్‌గౌడ్ పేరున వాళ్లతో బలవంతంగా చెప్పించి తప్పుడు కేసు నమోదు చేయించారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసిన బీసీ నాయకుడిని రేవంత్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడబలుక్కొని కేసు నమోదు చేయించి జైలుకి పంపించారని విమర్శించారు. 2001లో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే పట్టాలు ఇచ్చారని, ఇప్పుడు వాళ్లే కూలగొట్టడం బాధాకరమన్నారు. శ్రీకాంత్‌గౌడ్‌కు ఏమైనా హాని జరిగితే స్థానిక ఎమ్మెల్యేతో పాటు పోలీసులు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నాయకుడు వర్ధ భాస్కర్ టెరర్రిస్ట్ అయినట్టు ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి తెచ్చి పోలీస్‌స్టేషన్‌లో కొట్టారని, ఎందుకు కొట్టారని అడిగితే మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు కొందరు నాయకులపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. గద్వాలలో కాంగ్రెస్ నాయకుడిని వేధింపులకు ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంటే అరెస్ట్ చేయడం లేదని, పేదలకు అన్నం పెట్టిన శ్రీకాంత్‌గౌడ్‌ని మాత్రం తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపించారని అన్నారు. ఐటీ తనిఖీల తరువాత కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదేని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని, గాంధీ భవన్‌లో ఎఫ్‌ఐఆర్‌లు తయారవుతున్నాయని ఆరోపించారు. అంతకుముందు ఆర్‌ఎస్పీని మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అత్యాచారయత్నానికి గురైన బాలిక తల్లిదండ్రులు కలిశారు. ఘటన జరిగిన తీరు, పోలీస్‌లు స్పందించిన విధానం ఆయనకి వివరించారు. కార్యక్రమంలో నాయకులు ఇంతియాజ్, ఆంజనేయులు, విజయకుమార్, శ్రీనివాస్‌యాదవ్, నర్సింహులు, రాజేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment