కురుమూర్తికి పోటెత్తిన భక్తులు
చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలువు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. గోవింద నామంతో కురుమూర్తి గిరులు మార్మోగాయి. తెల్లవారుజామునే ఆలయ అర్చకులు స్వామి వారికి సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులతో క్యూలైన్ కిక్కిరిసిపోయింది. తమ ఇంటి ఇలవేల్పు అయిన స్వామి వారికి గండదీపాలు మోసి, పచ్చిపులుసు అన్నం నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
జోరుగా వ్యాపారం..
కురుమూర్తి జాతరలో వివిధ రకాల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. చిన్నారులు మొదలుకొని మహిళలు, పెద్దల వరకు వారికి కావాల్సిన వస్తువులు అందుబాటులో ఉండటంతో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మహిళలు వంట సామగ్రి, గాజులు, మిఠాయి దుకాణాల్లో సందడిగా గడుపుతున్నారు. అలాగే చిన్నారులు రంగుల రాట్నాలు, వాటర్ బోట్, స్పిరింగ్ జంపింగ్ వాటిలో ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. పెద్దలు సమీపంలోని కాల్చిన మటన్, మందు విందులతో మునిగితేలుతున్నారు. ఈ ఏడాది జాతరలో వ్యాపారం జోరుగా సాగుతుండటంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment