న్యాయవాదుల రక్షణ చట్టం అమలులో విఫలం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇండియన్ అసోసియేషన్ లాయర్స్ యూనియన్ మహాసభలు జిల్లా అధ్యక్షుడు బి.పరమేశ్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ఇప్పటికీ రక్షణ చట్టం తీసుకురావడంలో ఆయా ప్రభుత్వాలు వెనుకడుగు వేస్తున్నాయన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి తెలంగాణ పోరాటంలో కూడా న్యాయవాదుల పాత్ర అమోఘమైనదని, కానీ వారిపై జరుగుతున్న దాడులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఇప్పటికీ న్యాయవాదులు తమ వృత్తిని నిర్వహిస్తూనే సామాజిక అంశాల పట్ల స్పందిస్తున్న తీరును మరువలేనిదన్నారు. భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయడంలో పాలకులు వెనుకంజ వేస్తున్నారని ఆరోపించారు. సెక్షన్ 41 సీఆర్పీసీని తక్షణమే ఎత్తివేయాలని, జూనియర్ న్యాయవాదులకు రూ.5 వేల స్టైఫండ్ ఇవ్వాలని, హెల్త్, డెత్ బెనిఫిట్ స్కీంను రూ.20 లక్షలకు పెంచాలని, ప్రతి జిల్లాలో న్యాయవాదులకు ఇల్లు కేటాయించాలని, హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని జిల్లా కోర్టులకు నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఐఏఎల్ ప్రజాస్వామిక వాదులతో ఏర్పడిన సంఘమని, స్థాపించిన వారిలో జస్టిస్ కృష్ణ అయ్యర్, జస్టిస్ పీఎన్ భగవతి, జస్టిస్ డీఎన్ దేశాయ్, జస్టిస్ చిన్నపరెడ్డి, పద్మనాభరెడ్డి ముఖ్యులని, వారి ఆశయ సాధనలో ఐఏఎల్ సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. అనంతరం మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కం జనార్దన్ మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులు తమ వృత్తి పట్ల నిబద్ధతతో ఉండి వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో విల్సన్, బి.రాము, దత్తాత్రేయ, రమేష్, ఆర్‌ఆర్ మన్యం, శేఖరయ్య, జేసీ కుర్మయ్య, నిరంజన్, సలీం, వెంకట్రావు, జగదీష్, రాజు, చేతన్, ఎన్‌వీ మహేష్, నరసింహ, రామకృష్ణగౌడ్, ఉబేద్, సజ్జత్ అమేద్, వేణుగోపాల్‌గౌడ్, శివరాం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment