ప్రజావాణి అర్జీలు సత్వరం పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, పింఛన్లు తదితర సమస్యలపై 142 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి పరిష్కరించాలని.. లేనిచో వారికి తగిన సూచనలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం వచ్చిన ప్రతి దరఖాస్తుదారుడి ఇళ్లకు వెళ్లి, పూర్తి వివరాలను మొబైల్ యాప్‌లో పొందుపర్చాలని సూచించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్, మండల ప్రత్యేకాధికారులు సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ నర్సింహులు, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ నవీన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment