సమగ్రశిక్ష ఉద్యోగులకు ఎంపీ సంఘీభావం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని రెండు వారాలుగా సమ్మె చేస్తున్న సమగ్రశిక్ష సిబ్బందికి ఎంపీ డీకే అరుణ సంఘీభావం తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద సమ్మె చేస్తున్న ఉద్యోగులతో ఆమె మాట్లాడారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. చాలీచాలని వేతనాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డితో చర్చలు జరిగే క్రమంలో సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తామన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో సమగ్ర శిక్ష ఉద్యోగుల పాత్ర కీలకమని, వారికి కచ్చితంగా న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ధరల నియంత్రణలో విఫలం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విపరీతంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కన్స్యూమర్ అవేర్‌నెస్ ప్రొటెక్షన్, వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు అడమ్స్ డిమాండ్ చేశారు. సోమవారం సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసరాల ధరలను నియంత్రించలేక పోతుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వస్తు సేవల ఉత్పత్తి నిమిత్తం ఆయా సంస్థలకు సదుపాయాలు, వనరులు సమకూరుస్తున్న ప్రభుత్వాలు.. ధరల స్థిరీకరణ విషయంలో సర్వాధికారాలు కట్టపెడుతున్నాయన్నారు. వైద్య, విద్యాసంస్థల సేవల విషయంలో ధరల నియంత్రణ ఊసే లేదని అన్నారు. సంవత్సరానికి 3, 4 సార్లు ధరలు పెరుగుతుండటంతో మార్కెట్‌ను వినియోగదారుడు అంచనా వేయలేకపోతున్నారని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, డా.విజయ్‌మోహన్‌గౌడ్ ఉన్నారు.
విద్యార్థులు సమాజసేవ చేయాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఎన్‌ఎస్‌ఎస్‌లో పాల్గొనే విద్యార్థులు సమాజసేవ చేయాల్సిన అవసరం ఉందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలీపూర్, బండమీదిపల్లి ప్రాంతాల్లో యూనిట్–9 విద్యార్థులు వారం రోజుల పాటు శీతాకాల ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని నిర్వహించారు. సోమవారం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉండే అన్ని రుగ్మతలను రూపుమాపేందుకు ఎన్‌ఎస్‌ఎస్ ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని, గ్రామాల్లో ప్రజలను మద్యపాననిషేధం, బాల్యవివాహాలు, ఆరోగ్యం అంశాలపై చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందన్నా రు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలతో పాటు నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందన్నారు. పీయూలో ఉండే విద్యార్థులు హాస్ట ల్స్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దాని ద్వారా ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని సూచించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, అర్జున్‌కుమార్, నాగసుధ పాల్గొన్నారు.
శ్రీరామ్ గోల్డ్ ధాన్యం
ధర రూ.2,659
దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో సోమవారం జరిగిన టెండర్లలో శ్రీరామ్ గోల్డ్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,659గా నమోదైంది. ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,659, కనిష్టంగా రూ.2,619, కందులు గరిష్టంగా రూ.7,159, కనిష్టంగా రూ.6,909గా ధరలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment