మాటు వేసి.. దోచేసి
సాక్షి, నాగర్‌కర్నూల్: దేశవ్యాప్తంగా చోరీలు, దారి దోపిడీలకు పేరుమోసిన ముఠాలు తెలంగాణలోనూ సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి–44 పై వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద ఈ నెల18న చోటుచేసుకున్న దారి దోపిడీ ఘటన కలకలం సృష్టించింది. రహదారి పక్కనున్న ట్రక్ బే ప్రాంతంలో కొద్దిపాటి విశ్రాంతి కోసం వాహనాన్ని ఆపిన యాత్రికులపై మహారాష్ట్రకు చెందిన పార్థి గ్యాంగ్ మెరుపువేగంతో దాడిచేసి దోచుకెళ్లడం సంచలనం సృష్టించింది. హైవేల వెంట సుదీర్ఘకాలం పాటు మాటు వేసి.. అ దను దొరకగానే భయంకరమైన రీతిలో దాడి చేస్తూ.. దారిదోపిడీలకు పాల్పడటం ఈ గ్యాంగ్ ప్రత్యేకతగా పోలీసులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పరిశ్రమలు, రైస్‌మిల్లులు, వ్యవసాయ పనుల కోసం వేలాది సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వచ్చి ఇక్కడే ఉపాధి పొందుతున్నారు. ఈ పంథాలోనే పార్థి లాంటి దొంగల ముఠాలు సైతం వచ్చి వారిలో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారులు, రోడ్ల వెంట రాత్రివేళ ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎక్కడబడితే అక్కడ వాహనాలను ఆపడం సురక్షితం కాదని పోలీసులు సూచిస్తున్నారు.
సెల్‌ఫోన్లకు దూరం..
ఇతర రాష్ట్రాలకు చెందిన మేవాడ్, పార్థీ, బదయాన్ ముఠాలు రాష్ట్రంలో సంచరిస్తూ అక్కడక్కడ దోపిడీలకు పాల్పడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. జాతీయ రహదారుల వెంట నిర్మానుష్య ప్రాంతాల్లో మాటు వేసి ఆగి ఉన్న వాహనదారులపై మెరుపు వేగంతో దాడి చేయడం పార్థీగ్యాంగ్ ప్రత్యేకత. కత్తులు, గొడ్డళ్లు, బండరాళ్లతో వ్యక్తులపై దాడి చేసి రక్తపాతం సృష్టిస్తారు. ఈ అనూహ్య ఘటనతో బాధితులు షాక్‌లో ఉండగానే వారి నుంచి ఆభరణాలు దోచుకుంటారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున ప్రయాణించే వాహనదారులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతారు. ఈ గ్యాంగ్ దారిదోపిడిలకు పాల్పడే సమయంలో సెల్‌ఫోన్‌ను అసలే వినియోగించరని తెలుస్తోంది. హైవేల సమీపంలో పరిశ్రమలు, వ్యవసాయ పనుల్లో కూలీలుగా చిన్న చిన్న పనులు చేసుకుంటూనే.. మాటు వేసి ఉంటారు. అనుకున్న లక్ష్యం దొరకగానే మెరుపు వేగంతో దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా పట్టుబడిన నిందితులు సైతం పెబ్బేరు సమీపంలోని చెరకు ఫ్యాక్టరీకి పంటను తరలించే కూలీలుగా చెలామణి అవుతూనే.. దోపిడీకి పాల్పడ్డారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో వలస కార్మికులు ఇక్కడి పరిశ్రమలు, రైస్‌మిల్లులు, వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ప్రధానంగా జాతీయ రహదారుల వెంట వీరి అలికిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి దారి దోపిడీ ముఠాలపై నిఘా పెంచాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కత్తులు, బండరాళ్లతో దాడి..
హైదరాబాద్– బెంగళూరు జాతీయ రహదారి–44పై పెబ్బేరు సమీపంలో ఈ నెల 18న తెల్లవారుజామున చోటుచేసుకున్న దారిదోపిడి ఘటనలో నిందితులను రెండు రోజుల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం కారులో తిరుపతికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో పెబ్బేరు సమీపంలో ఉన్న ట్రక్ బే వద్ద విశ్రాంతి కోసం ఆగారు. అక్కడే చెరుకు ట్రాక్టర్లలో కూలీల రూపంలో మాటు వేసుకున్న ఉన్న పార్థీగ్యాంగ్ వాహనంలో ఉన్న వారిపై కత్తులు, బండరాళ్లలో పాశవికంగా దాడి చేసి దారిదోపిడీకి పాల్పడ్డారు. వారిని తీవ్రంగా గాయపర్చి, మహిళల వద్ద ఉన్న 13 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఇంత జరుగుతున్నా ఘటనా ప్రదేశంలోనే ఉండి తీరిగ్గా చూస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ల ప్రవర్తనపై వచ్చిన అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీడ్ జిల్లాలకు చెందిన పార్థీగ్యాంగ్ పనిగా పోలీసులు తేల్చారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
దారి దోపిడీలో ఆరితేరిన మహారాష్ట్ర ట్రైబల్ గ్రూప్
ఇటీవల జాతీయ రహదారి–44లో పెబ్బేరు వద్ద ఘటన
భయంకరమైన రీతిలో దోచుకోవడమే పార్థీగ్యాంగ్ స్పెషాలిటీ
రెండురోజుల్లోనే
ముఠాను పట్టుకున్న పోలీసులు
రాత్రివేళ ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
Comments
Please login to add a commentAdd a comment