దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం
స్టేషన్ మహబూబ్‌నగర్: దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతోందని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశంలో పరిస్థితుల దృష్ట్యా, ప్రజల కోరిక మేరకు రాహుల్‌గాంధీ భారత్‌జోడో, భారత్ న్యాయ్‌యాత్రలు చేపట్టినట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతున్న నేపథ్యంలో రాహుల్‌గాంఽధీ చేపట్టిన యాత్రకు ప్రజలందరూ సంపూర్ణ మద్దతు పలికారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న రాహుల్‌గాంధీపై బీజేపీ నాయకులు పదే పదే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పెత్తందారులను బలోపేతం చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలనేది బీజేపీ సిద్ధాంతమైతే, దేశంలో సమానత్వం, పౌరులకు సమాన హక్కులు ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమన్నారు. రాజ్యసభలో దేశ రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తన పదవికి రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని పేర్కొన్నారు. హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు దేశానికి అవమానకరంగా ఉన్నాయని, ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అమిత్‌షా తన పదవికి రాజీనామా చేసి భారత జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్‌ను రాజ్యసభలో హోంమంత్రి అమిత్‌షా అవమానించడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు డీసీసీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, నాయకులు ఎన్‌పీ వెంకటేశ్, సీజే బెనహర్, జహీర్ అక్తర్, అజ్మత్‌అలీ, అవేజ్ తదితరులు పాల్గొన్నారు.
అమిత్‌షా జాతికి క్షమాపణలు చెప్పాలి
సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment